కొత్త మండలాల్లో కష్టాలు

ABN , First Publish Date - 2021-12-31T05:24:04+05:30 IST

కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించడాన్ని విస్మరిస్తోంది.

కొత్త మండలాల్లో కష్టాలు

 - అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు

- అరకొర వసతులు, అద్దె చెల్లింపులో జాప్యం

- ఇబ్బందుల్లో ప్రజలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించడాన్ని విస్మరిస్తోంది. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలను చాలీచాలని వసతుల మధ్య నిర్వహిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అద్దె చెల్లించే  విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా ప్రైవేట్‌ భవనాల యజమానులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు కూడా జిల్లాలో ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు గన్నేరువరం మండలం ఎంపీడీవో కార్యాలయం ఉదాహరణగా నిలుస్తున్నది. జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలో కరీంనగర్‌ జిల్లాలో గన్నేరువరం, కొత్తపల్లి, ఇల్లందకుంట, కరీంనగర్‌ అర్బన్‌ మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. కొత్తపల్లి, కరీంనగర్‌ అర్బన్‌ మండలాల కార్యాలయాలను జిల్లా కేంద్రంలోనే ఉన్న ప్రభుత్వ భవనాల్లో నెలకొల్పారు. గన్నేరువరం, ఇల్లందకుంట మండలాల్లో అద్దె భవనాలలో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు.

- గన్నేరువరం ఎంపీడీవో కార్యాలయానికి తాళం

గన్నేరువరం మండలాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రైవేట్‌ భవనంలో ప్రారంభించారు. ఈ భవనానికి 18 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని ఇటీవల దానికి తాళం వేశాడు. ఎంపీడీవో యజమానితో సంప్రదింపులు జరిపి వారం రోజుల్లో బకాయి చెల్లిస్తామని చెప్పి తాళం తీయించారు. మండల పరిషత్‌ ఖర్చుల పద్దు నుంచి ఇంటి కిరాయిని చెల్లించి వెంటనే కార్యాలయాన్ని గ్రామంలో ఉన్న మహిళా సంఘభవనానికి మార్చారు. ఆ భవనంలో ఉన్న ఒకే హాలులో అధికారులందరు టేబుళ్లు వేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. ఒకే హాల్‌లో కార్యాలయ నిర్వహణతో తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తున్నందున స్థానిక ఎస్సీ హాస్టల్‌లోకి కార్యాలయాన్ని మార్చేందుకు అనుమతివ్వాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. నిత్యం శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీస్‌ స్టేషన్‌ను ఆయుర్వేద ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేశారు. తహసిల్దార్‌ కార్యాలయాన్ని కూడా ప్రైవేట్‌ భవనంలోనే నెలకొల్పారు. రైతు వేదిక భవనంలో వ్యవసాయాధికారి కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన జువ్వాడి మన్మోహన్‌రావు అనే వ్యక్తి తన రెండెకరాల స్థలాన్ని పోలీస్‌ స్టేషన్‌, తహసిల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల కోసం విరాళంగా ఇచ్చి ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్‌ కూడా చేశారు. అయినా ఇప్పటి వరకు పక్కా భవనాల నిర్మాణాన్ని మాత్రం చేపట్టడం లేదు

- టీటీడీ అతిథి గృహంలో పోలీస్‌ స్టేషన్‌

ఇల్లందకుంట మండల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందిన టీటీడీ అతిథిగృహంలో పోలీస్‌ స్టేషన్‌ను, దేవాలయ కల్యాణ మండపంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని నెలకొల్పారు. ఎంపీడీవో కార్యాలయాన్ని నెలకు 9,100 రూపాయల అద్దెతో ప్రైవేట్‌ భవనంలో నిర్వహిస్తున్నారు. కల్యాణ మండపం, అతిథిగృహాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఆలయానికి వచ్చే భక్తులు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు ఆ రెండు కార్యాలయాల అధికారులకు నోటీసులు జారీ చేశారు. భక్తులకు, కార్యాలయాలకు వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండలాల కార్యాలయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా వాటిని ఆయా మండలాల్లో కాకుండా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణ, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే లక్ష్యంతో మండలాలను ఏర్పాటు చేసి కార్యాలయాలను మాత్రం మండలాల్లో కాకుండా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొత్త మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించడంతోపాటు స్టాఫ్‌ క్వార్టర్ల వసతి కూడా కల్పించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-12-31T05:24:04+05:30 IST