అన్నదాతపై డీజిల్‌ భారం

ABN , First Publish Date - 2021-10-31T06:01:23+05:30 IST

దినదినం పెరుగుతున్న డీజిల్‌ ధరల ప్రభావం వ్యవసాయంపై కూడా పడింది. నాలుగు రోజుల నుంచి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

అన్నదాతపై డీజిల్‌ భారం

- జిల్లాలో మొదలైన వరికోతలు 

- రేట్లు పెంచిన హార్వెస్టర్‌ యజమానులు 

- గంటకు రూ.200 నుంచి 400 వరకు పెంపు

- ఎకరం వరి కోతకు అదనంగా రూ.1500 

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దినదినం పెరుగుతున్న డీజిల్‌ ధరల ప్రభావం వ్యవసాయంపై కూడా పడింది. నాలుగు రోజుల నుంచి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి కోసేందుకు వినియోగించే హార్వెస్టర్‌ యంత్రాల యజమానులు, ట్రాక్టర్ల యజమానులు కూడా ధరలు పెంచడంతో రైతులపై భారం పడుతున్నది. గత ఏడాది వర్షాకాలం సీజన్‌ పంట కోతలకు, ఈ సీజన్‌ పంట కోతలకు అదనంగా 1500 నుంచి రూ. 2 వేల రూపాయల వరకు పడుతున్నది. గత ఏడాదికి, ప్రస్తుతానికి లీటర్‌ డీజిల్‌ ధర అదనంగా 30 రూపాయల వరకు పెరగడంతో హార్వెస్టర్‌, ట్రాక్టర్ల యజమానులు అదనంగా ధరలను పెంచారు. 

- రెండు లక్షలు ఎకరాల్లో వరి..

జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఇందులో 85 శాతం వరి పంటను వరికోత యంత్రాల ద్వారానే కోస్తూ ఉంటారు. ఈ వర్షాకాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో పొలాల్లో నేటికి కూడా నీళ్లు ఉన్నాయి. కొన్ని పొలాల్లో తడి ఆరక పోవడంతో చైన్‌ మిషన్ల ద్వారా వరి కోయిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌లో ఒక ఎకరం వరి కోసేందుకు ఒక గంట నుంచి గంటన్నర వరకు, బురద ఎక్కువగా ఉంటే 2 గంటల సమయం పడుతున్నదని రైతులు చెబుతున్నారు. యాసంగిలో గంటకు ఎకరం పొలాన్ని కోస్తారు. ఈసారి పొలాల్లో తడి ఎక్కువగా ఉండడంతో టైర్లతో నడిచే వరికోత యంత్రాలు దిగబడుతున్నాయని రైతులు చెబుతున్నారు. గత ఏడాది వర్షాకాలం సీజన్‌లో చైన్‌ మిషన్లకు గంటకు 2 వేల వరకు, టైర్లతో నడిచే యంత్రాలకు గంటకు 1,600 నుంచి 1,800 వరకు వసూలు చేశారు. ప్రస్తుతం చైన్‌తో నడిచే యంత్రాలకు 2,600 వరకు, టైర్లతో నడిచే యంత్రాలకు 2,200 వరకు వసూలు చేస్తున్నారు. 

- లబోదిబోమంటున్న రైతులు.. 

అలాగే వరి కోసిన తర్వాత ట్రాక్లర్ల ద్వారా వరి కల్లాలకు గానీ, కొనుగోలు కేంద్రాలకు వడ్లను తరలించేందుకు ఒక ట్రిప్పుకు 700 వరకు తీసుకోగా, ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. డీజిల్‌ ధరల ప్రభావం పంట కోతలపై కూడా పడడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది కూలీల ధరలు, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల ధరలతో పాటు వరికోత యంత్రాల కిరాయిలు కూడా పెరగడం రైతులపై తీరని భారం పడుతున్నది. క్వింటాలు ధాన్యానికి కేంద్రం ప్రభుత్వం గత ఏడాది కంటే ఈ ఏడాది 70 రూపాయల వరకు పెంచినప్పటికీ, ఆ డబ్బులన్నీ పెరిగిన ధరలకే పోతున్నాయని, వ్యవసాయం చేయడం వల్ల తమకు పెద్దగా గిట్టుబాటు ఏమి కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దళారులు వరికోత యంత్రాలను లీజుకు తీసుకుని వచ్చి కూడా ధరలను పెంచుతున్నారని రైతులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై వసూలు చేస్తున్న పన్నులను తగ్గించని కారణంగా వాటి ధరలు పెరుగుతున్నాయని అన్నారు. వాటి ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నదని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెట్రో ఉత్పత్తులపై వేస్తున్న పన్నులను తగ్గించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-10-31T06:01:23+05:30 IST