ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టింది..ఆ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు

ABN , First Publish Date - 2021-12-03T06:35:37+05:30 IST

ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్‌లో వరకట్న వేధింపులతో చిందం పవిత్ర(24) అనే నవ వధువు బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టింది..ఆ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు
పవిత్ర (ఫైల్‌)

పెళ్లైన 15 రోజుల నుంచే వేధింపులు

గోదావరిఖని/మంచిర్యాల/ముత్తారం: ఆ తల్లిదండ్రులు ఉన్నంతలో తన కూతురికి ఘనంగా వివాహం జరిపించారు. ఆ యువతి ఎన్నో ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. పెళ్లైన 15 రోజుల నుంచే భర్త, అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించారు. దీంతో మనస్తాపం చెందిన యువతి తన తల్లిదండ్రులకు భారం కావద్దు అనుకుందో ఏమో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్‌లో వరకట్న వేధింపులతో చిందం పవిత్ర(24) అనే నవ వధువు బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన మారం పవిత్రకు మంథనిమండలం గాజులపల్లి గ్రామానికి చెందిన చిందం నరేష్‌కు మూడునెలల క్రితం వివాహం  జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద 17లక్షల రూపాయలు, బైక్‌, 17 తులాల బంగారం ఇచ్చారు.


వివాహం జరిగిన 15 రోజుల తరువాత ఫర్టిలైజర్‌ షాపులో తమకు నష్టం వచ్చిందని, అదనంగా మరో 10 లక్షల కట్నం తీసుకురావాలని పవిత్రను భర్త చిందం నరేష్‌, అత్తమామలు లక్ష్మి, ఓదెలు, బావ రమేష్‌, మరిది సురేష్‌ వేధించారు. దీంతో పవిత్రను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల క్రితం పవిత్ర భర్త నరేష్‌తో పాటు, అత్తమామలు గాజులపల్లికి వెళ్లి అదనంగా 10 లక్షల కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తామని తేల్చిచెప్పారు. దీంతో పవిత్ర అప్పటి నుంచి ఆందోళన చెందుతోంది. బుధవారం రాత్రి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకోని పవిత్ర ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం తెల్లవారుజామున తల్లి సరోజన పశువులకు మేత వేసేందుకు వెళ్లగా పవిత్ర ఉరికి వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెందింది. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌, మంథని సీఐ సతీష్‌, ముత్తారం ఎస్సై బేతి రాములు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి మారం వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-12-03T06:35:37+05:30 IST