కరోనా కల్లోలం..

ABN , First Publish Date - 2021-05-02T05:44:25+05:30 IST

జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది.

కరోనా కల్లోలం..

- కుటుంబాలను చెల్లాచెదురు చేస్తున్న మహమ్మారి

- తండ్రీకొడుకులు, దంపతుల మృతి..

- వారంరోజుల్లో 28 మందికిపైగా..

- విషాదాన్ని నింపుతున్న వైరస్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. మహమ్మారి కరోనా తండ్రీకొడుకులను, భార్యాభర్తలను కబళిస్తున్నది. అయిన వారి కడచూపునకు కూడా నోచుకోకుండా చేస్తున్నది. ఇంటిపెద్దలను కుటుంబాలకు దూరం చేస్తున్నది. ఇంట్లో ఒకరికి కరోనా వస్తే, అందరికి వ్యాపిస్తున్నది. గడిచిన వారం రోజుల్లో జిల్లాలో 28 మందికి పైగా కరోనా బారినపడి మృతిచెందారు. వారం రోజుల నుంచి మరణాలు ఆగడం లేదు. శనివారం ఒక్కరోజే జిల్లాలో ఆరుగురు కరోనా బారినపడి మృతిచెందడం ఆందోళన రేకెత్తిస్తున్నది. యైుటింక్లయిన్‌ కాలనీకి చెందిన ఒక సింగరేణి కార్మికుడికి కరోనా సోకగా, ఆయన పది రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయనతో ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు కూడా కరోనా సోకింది. ఆయన భార్య కూడా శనివారం కరోనాతో కన్నుమూసింది. కరోనాతో చికిత్స పొందుతున్న ఇద్దరు పిల్లలు విషాదంలో మునిగిపోయారు. 15 రోజుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి కడుదయనీయం. అలాగే గోదావరిఖనిలోని లెనిన్‌నగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్‌ కరోనాతో మృతిచెందగా, శుక్రవారం అతడి కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందడం గమనార్హం. ఇంట్లో ఉన్న వారంతా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. 30 ఏళ్ల నుంచి మొదలుకుని 80 ఏళ్ల వృద్ధుల వరకు కరోనాతో మృతిచెందుతున్నారు. గోదావరిఖని ప్రాంతంలో ఎక్కువమంది మృతిచెందుతున్నారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, సుల్తానాబాద్‌, పెద్దపల్లి, ధర్మారం, పాలకుర్తి, రామగుండం, ఆయా మండలాల్లో పలువురు కరోనా బారినపడి మరణించారు. 

రోజుకు 250కి పైనే కేసులు..

జిల్లాలో రోజుకు 250కి పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఏప్రిల్‌లోనే 6 వేల మందికి కరోనా సోకడం గమనార్హం. కరోనా ఉధృతి ఆగడం లేదు. కరోనా టెస్టులు పెంచితే పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడనున్నాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందక చనిపోతున్నారు. జిల్లాలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు సుల్తానాబాద్‌, గోదావరిఖనిలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినా కూడా వెంటిలేటర్లు లేక వారిని కరీంనగర్‌కు పంపిస్తున్నారు. చాలా మంది రోగులు కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. కొందరు కోలుకుంటుండగా, మరికొందరు చికిత్స పొందుతూనే మరణిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌ సౌకర్యాన్ని ఎందుకు కల్పించడం లేదో తెలియడం లేదు. పెద్దపల్లిలో ఒకటి, గోదావరిఖని ఆసుపత్రిలో ఒకటి ఉన్నప్పటికీ వాటిని ఆపరేషన్‌ థియేటర్లలో వాడుకుంటున్నారు. కరోనా కోసం ప్రత్యేకించి వెంటిలేటర్‌ సౌకర్యం మాత్రం లేదు. కేసులను కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సరైన వ్యూహాన్ని అనుసరించడం లేదు. కరోనా టెస్టులు చేసే కేంద్రాలకు ప్రతి రోజు చాలా మంది వస్తున్నప్పటికీ, వారికి టోకెన్లు జారీ చేసి ఒక్కొక్కరిని పిలిచి వివరాలు నమోదు చేయకుండా లైన్లలో నిలబెట్టడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నది. అలాగే కొన్ని ఆసుపత్రుల్లో పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్‌ కూడా ఒకేచోట చేయడం వల్ల కూడా కరోనా ఉధృతి పెరుగుతున్నది. బహిరంగ మార్కెట్లలో ఎక్కడ కూడా భౌతిక దూరాన్ని పాటించడం లేదు. షాపుల వద్ద కూడా అలాంటి పరిస్థితి అంతే ఉన్నది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పుడు షాపుల వద్ద, మార్కెట్లలో భౌతిక దూరాన్ని పాటించేందుకు గాను బాక్సులు వేసి నిబంధనలను అమలుచేశారు. ప్రస్తుతానికి లాక్‌డౌన్‌ అమలుచేయకపోయినా, కనీస నిబంధనలు పాటించే విధంగా ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధించడం లేదని ఆయా వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో కరోనా పరిస్థితిపై సమీక్ష జరిపి పలు చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-05-02T05:44:25+05:30 IST