సహకార సంఘాలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2021-02-05T05:49:36+05:30 IST

సహకార సంఘాలను బలోపేతం చేసుకుని రైతుల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

సహకార సంఘాలను బలోపేతం చేయాలి
సహకార సంఘాల అధ్యక్షులకు చెక్కును అందజేస్తున్న మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌

 94 శాతం రికవరీతో కరీంనగర్‌ కేంద్ర సహకార బ్యాంకు పనితీరు బేష్‌

 రైతులు అప్పు తీసుకోకుండా స్వయం పోషకులుగా ఎదగాలి

 రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

 రుణాలను సులభతరం చేసి రైతులకు అండగా నిలువాలి 

 రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 4: సహకార సంఘాలను బలోపేతం చేసుకుని రైతుల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు అనుబంధంగా రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ సహకార సంఘాలు అభివృద్ధి చెందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని అభినందించారు. గురువారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కేడీసీసీబీ నూతన బ్రాంచి, కేడీసీసీబీ పరిపాలన భవనాన్ని ఆయన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్‌, జాతీయ సహకార బ్యాంకు సంఘాల సమాఖ్య (నాప్‌క్యాబ్‌) చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కె.విజయ, జిల్లా కలెక్టర్‌ కె.శశాంకతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలను బలోపేతం చేస్తే రైతులు అప్పులు తీసుకోవడం మానుకొని స్వయం పోషకులుగా ఎదుగుతారని, అలా కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. రాష్ట్రంలో 59 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించామన్నారు. రాష్ట్రంలో కోటి 55 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందని అన్నారు. చాలా బ్యాంకులు రుణాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటాయి కానీ వాటి వసూళ్ల విషయాన్ని ప్రశ్నిస్తే ముఖం చాటేస్తాయన్నారు. కొన్ని జాతీయ బ్యాంకులు ఇచ్చిన రుణాలను వసూలు చేయలేక నిలదొక్కుకునేందుకు రెండు, మూడు ఒకే బ్యాంకుగా విలీనమవుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో వేలాది కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని విదేశాలకు వెళ్తున్న బడాబాబులతో బ్యాంకులు దివాళా తీస్తున్నాయని, వాటి భారం ప్రజలపై పడుతోందని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాలు ఇవ్వడంలోనే కాకుండా 94శాతం రుణాలను వసూలు చేయడం బ్యాంకు పనితీరుకు నిదర్శనమని అభినందించారు. రూ. 68 కోట్ల నష్టాలతో ఉన్న కేడీసీసీబీని అసాధారణ స్థితికి తీసుకువచ్చారని, ఒక్కరోజులోనే కోటి రూపాయల రుణాలు ఇవ్వడం రాష్ట్రానికే గర్వకారణమని చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుతో పాటు పాలకవర్గం, అధికారులు, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు నీరు, కరెంటు, పెట్టుబడి ఖర్చులతో ఇబ్బందులు పడుతుండగా సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీరు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా కల్పిస్తుండడంతో సాగు లాభసాటిగా మారిందన్నారు. సాగు విస్తీర్ణం పెరిగిందని, యాసంగిలో పంట దిగుబడి భారీగా పెరుగుతుందని, సహకార సంఘాలు వారికి అండగా నిలువాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టం అనుకూలంగా లేదని, చట్టం ఎలా ఉన్నా రైతులు ఇబ్బందులు పడకుండా గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని, తప్పకుండా రైతులకు మేలు చేస్తారని అన్నారు. సహకార సంఘాల్లో రైతులకు ఇచ్చే రుణాలను సులభతరం చేసి వారికి చేయూతనిచ్చి, వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. సభాధ్యక్షుడు న్యాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ 6 లక్షల 55వేలకు పైగా ఖాతాదారులకు సహకార బ్యాంకు ద్వారా సేవలందిస్తున్నామని, గ్రామీణ సౌభాగ్యమే తమ లక్ష్యమని అన్నారు. రుణాలు మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాల ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా 83 కోట్ల రూపాయల రుణాలను మంత్రుల చేతుల మీదుగా ఫ్యాక్స్‌ చైర్మన్లకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎం ఎస్‌ చైర్మన్‌ ఎ.శ్రీకాంత్‌, కేడీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేశ్‌, కేడీసీసీబీ  జీఎం  సత్యనారాయ ణరావు, కేడీసీసీబీ పాలకవర్గసభ్యులు, సింగిల్‌ విండో చైర్మన్లు, మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతితో పాటు పలువురు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-05T05:49:36+05:30 IST