Huzurabad: బరిలోకి కాంగ్రెస్...బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ

ABN , First Publish Date - 2021-10-07T06:16:34+05:30 IST

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థి నామినేషన్‌తోపాటే ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నది.

Huzurabad: బరిలోకి కాంగ్రెస్...బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ

8న బల్మూరి వెంకట్‌ నామినేషన్‌ 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాక 

అసంతృప్తులను బుజ్జగించిన నేతలు 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థి నామినేషన్‌తోపాటే ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన ప్రచారం ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ కూడా ఐదు నెలల క్రితమే ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్‌ పార్టీ ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్నది. ఈ నెల 2న అధికారికంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకటనర్సింగారావును ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన విద్యార్థి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ఆందోళనలో పోలీసు లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. అభ్యర్థిగా ఎంపికైనా ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గానికి రానిపరిస్థితిలో చికిత్సపొందుతూ ఉన్నారు. 


నామినేషన్‌ వేసే రోజు రానున్న అగ్ర నేతలు

ఈనెల 8న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ కాగా ఆయన ఆ రోజే తన నామినేషన్‌ను వేయనున్నారు. కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌ హాజరుకానున్నారు. నామినేషన్‌ రోజు నుంచే ప్రచారాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. నామినేషన్‌ వేసే నాటికి పోలింగ్‌ తేదీకి 22 రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఒక్క రోజు కూడా వృథా చేయకుండా అన్ని గ్రామాలు చుట్టిరావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. విద్యార్థి, యువజన విభాగాలు ఇప్పటికే ప్రచారానికి మండలాలవారీగా, పట్టణాల వారీగా సమన్వయకర్తలను నియమించాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చి ఆ రోజు నుంచి ప్రచార బాధ్యతలను సీనియర్‌ నాయకులకు అప్పగిస్తారని ఆయన కూడా వీలైనన్ని గ్రామాల్లో పర్యటిస్తారని చెబుతున్నారు. 


విద్యార్థి సంఘ నాయకుడిగా అవకాశం

నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ 19 మంది పార్టీ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఉన్నవారిని కాదని, పార్టీ అధిష్ఠానం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. విద్యార్థి, నిరుద్యోగ సైరన్‌ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఆ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తూ దానికి ఒక ఊపును ఇవ్వడానికి విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం సమంజసమని భావించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీని ద్వారా విద్యార్థి, యువజన విభాగం నేతల్లో తమకు ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలివ్వడమే లక్ష్యంగా వెంకట్‌ను బరిలోకి దింపారని, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా విద్యార్థి విభాగం నాయకుడికి పోటీచేసే అవకాశం కల్పించినందున తాము కూడా విద్యార్థి నాయకుడినే పోటీలో ఉంచాలని కాంగ్రెస్‌ భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 61వేల పై చిలుకు ఓట్లను తెచ్చుకున్న కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇప్పుడు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరిగా సాగుతున్న పోరును ముక్కోణ పోటీగా మార్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. అందుకు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడం పార్టీకి చెందిన కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం కొంత ప్రతిబంధకంగా భావిస్తున్నారు. 


స్థానిక నాయకులతో చర్చలు

ఇక్కడ నుంచి టికెట్‌ను ఆశించినవారంతా దరఖాస్తు చేయని వెంకట్‌కు అవకాశం కల్పించి తమను చిన్నచూపు చూశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తులను బుజ్జగించడానికి పార్టీ అధిష్ఠానం మంగళవారం గాంధీభవన్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దీనికి టీకెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 19 మందిలో 15 మంది హాజరయ్యారు. టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకొని బుజ్జగించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బల్మూరి వెంకట్‌కు అధిష్ఠానం అవకాశం కల్పించిందని టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు. 8న అభ్యర్థి నామినేషన్‌ వేయడంతో కాంగ్రెస్‌ ప్రచారం ప్రారంభం కానున్నది. 


అదే రోజు బీజేపీ అభ్యర్థి ఈటల నామినేషన్‌ 

ఐదు నెలలుగా ప్రచారంలోనే తలమునకలైన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఈనెల 8న తన నామినేషన్‌ వేయనున్నారు. ఆయన నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, సభ్యులు రఘునందన్‌రావు, ధర్మారావు, రవీందర్‌రెడ్డి ఈకార్యక్రమానికి హాజరవుతారు. ఈటల సతీమణి తరపున ఇప్పటికే పార్టీ కార్యకర్తలు నామినేషన్లు వేశారు. 

Updated Date - 2021-10-07T06:16:34+05:30 IST