ఆన్నదాతల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-23T06:41:21+05:30 IST

ధాన్యం రంగు మారిందని మిల్లరు సంచికి మూడు కిలోల కోత విధిస్తున్నాడని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆన్నదాతల ఆందోళన
పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేస్తున్న రైతు రాజు

- పెట్రోల్‌ బాటిల్‌తో రైతు నిరసన

- అధికారులు, పోలీసులతో వాగ్వాదం

ఎల్లారెడ్డిపేట, నవంబరు 22:  ధాన్యం  రంగు మారిందని మిల్లరు సంచికి మూడు కిలోల కోత విధిస్తున్నాడని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరి సిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేం ద్రం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆరుగురు రైతులకు చెందిన ధాన్యాన్ని సంచికి  రెండు కిలోలు అదనంగా 42 కిలోల చొప్పున సేకరించి ఐదు ట్రాక్టర్లలో గుండారంలోని రైస్‌ మిల్లుకు తరలించారు. ఆ రైస్‌ మిల్లు మూసి ఉండడంతో అక్కడ పడిగాపులు కాయలేక ట్రాక్టర్లను తిరిగి కేంద్రానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఐకేపీ ఏపీఎం మల్లేశం ఆ ధాన్యాన్ని మండల కేంద్రంలోని మరో రైస్‌ మిల్లుకు తరలించారు. రైస్‌ మిల్లరు ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం అధికంగా ఉండడంతోపాటు రంగు మారిందని పేర్కొంటూ ధాన్యం తీసుకోబోమని చెప్పాడు. దీంతో రైతులు రైస్‌ మిల్లుకు చేరుకుని మిల్లరుతో మాట్లాడారు. సంచికి మరో మూడు కిలోలు కోతకు ఒప్పుకుంటే ధాన్యం దించుకుంటామని మిల్లరు చెప్పాడు. అందుకు అంగీకరించని రైతులు ట్రాక్టర్లను కేంద్రానికి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డుగా ఉంచి రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు.  రాజు అనే రైతు పెట్రోల్‌ బాటిల్‌ వెంట తెచ్చుకొని ఒంటిపై పోసుకునేందుకు యత్నించాడు. గమనించిన తోటి రైతులు, అక్కడే ఉన్న పోలీసులు బాటిల్‌ను తీసుకున్నారు. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య ఆగి సమస్యను తెలుసుకున్నారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వినిపించుకోని రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడికి చేరుకున్న అధికారులను రైతులు నిలదీశారు. సంచికి ఐదు కిలోలు కట్‌ చేస్తే తాము పంట పండించి ఎందుకని ప్రశ్నించారు. ధాన్యాన్ని పరిశీలించాలని పట్టుబట్టారు. ట్రాక్టర్ల నుంచి ధాన్యం సంచులను రోడ్డుపైకి తీసుకొచ్చారు. దీంతో అధికారులు  ధాన్యాన్ని పరిశీలించారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.


Updated Date - 2021-11-23T06:41:21+05:30 IST