ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ABN , First Publish Date - 2021-12-30T05:11:59+05:30 IST

వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో వందశాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రకటించారు.

ధాన్యం కొనుగోళ్లు పూర్తి

 

- కొన్నది 3.8 లక్షల టన్నులు 

- కొనుగోలు కేంద్రాల మూసివేత

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో వందశాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ ప్రకటించారు. ఈ వానాకాలంలో 6.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో విత్తనపంట, రైతులు స్వంత అవసరానికి మినహాయించుకునే ధాన్యం పోనూ 4.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయం కోసం రైతులు తీసుకువస్తారని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం 351 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరిధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో ఇప్పుడు వాటన్నింటిని మూసివేశారు.


 కొన్న ధాన్యం విలువ 745.92 కోట్లు


జిల్లాలో 67,506 మంది రైతుల నుండి 745 కోట్ల 92 లక్షల రూపాయల విలువ చేసే 3,80,573 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 67,168 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 715 కోట్ల 92 లక్షల రూపాయలు జమ చేశారు. మరో 30 కోట్ల రూపాయలను ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉన్నది. గత వానాకాలంలో 2.50 లక్షల మెట్రక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా ఈసారి అదనంగా 1.30 లక్షల మెట్రిక్‌ టన్నులు పెరిగింది. వర్షాలు విస్తారంగా కురవడంతోపాటు కాళేశ్వరం నీటితో జల వనరులన్నీ సమృద్ధిగా మారి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో వరి దిగుబడి అధికంగా వచ్చింది. ఎకరాకు 22 క్వింటాళ్ల చొప్పున దిగుబడి రావడంతో రైతులకు అదనపు అదాయం సమకూరింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావడం ముగిసినందున కొనుగోలు కేంద్రాలన్నింటిని మూసేశారు. 


 వంద శాతం ధాన్యం కొన్నాం..

- అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌


ఙజిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వంద శాతం కొన్నాం. జిల్లాలో ధాన్యం సజావుగా సేకరించేందుకు సహకరించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత వానాకాలంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరగడంతో ఈసారి దిగుబడి పెరిగి 3,80,573 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. ఇప్పటి వరకు రైతులకు 715.92 కోట్ల రూపాయలు చెల్లించాం. మిగతా రైతులకు త్వరలోనే డబ్బు జమ చేస్తాం. 

Updated Date - 2021-12-30T05:11:59+05:30 IST