జాతీయస్థాయి గుర్తింపు రావడం అభినందనీయం

ABN , First Publish Date - 2021-12-31T05:19:16+05:30 IST

కేంద్ర ప్రభుత్వం నిర్వహించి సఫాయిమిత్ర సురక్షా పోటీలో కరీంనగర్‌ నగరపాలక సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం అభినందనీయమని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.

జాతీయస్థాయి గుర్తింపు రావడం అభినందనీయం
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న మేయర్‌ సునీల్‌ రావు, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌

 - స్వచ్ఛ సర్వేక్షణ్‌-22లో మంచిర్యాంకు సాధించి ఆదర్శంగా నిలవాలి 

- వీడియో కాన్ఫరెన్సులో మేయర్‌ను ప్రశంసించిన మంత్రి కేటీఆర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబర్‌ 30: కేంద్ర ప్రభుత్వం నిర్వహించి సఫాయిమిత్ర సురక్షా పోటీలో కరీంనగర్‌ నగరపాలక సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం అభినందనీయమని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇదే స్పూర్తితో స్వచ్చసర్వేక్షణ్‌-22లో కూడా మంచి ర్యాంకు సాధించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలోని మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, అర్బన్‌ లోకల్‌ బాడీ అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌లోని వివిధ విభాగాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ నేతృత్వంలో పాలకవర్గం, అఽధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ, తడి, పొడి చెత్త విభజనతో పారిశుధ్య పనులను మరింత మెరుగుపరిచి స్వచ్చసర్వేక్షన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియలో వాటర్‌+ రావడం కోసం కృషిచేస్తామని మేయర్‌ చెప్పడం గర్వంగా ఉందని అన్నారు. నగరంలో డెయిలీ వాటర్‌ స్కీం ఎలా ఉందని మంత్రి ప్రశ్నించగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజూ మంచినీటిని అందిస్తున్నామని మేయర్‌ తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్‌, ప్లానింగ్‌బోర్డు వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ సహకారంతో నగరంలో 24/7 మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి పైలెట్‌ ప్రాజెక్టు కింద మూడు రిజర్వాయర్లను ఎంపిక చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రతి నెలా మంజూరు చేసిన 50 కోట్ల నిధుల్లో 32 కోట్ల రూపాయలను వాకింగ్‌ ట్రాక్స్‌, పార్కులు, గ్రేవ్‌యార్డులు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల అభివృద్ధికి, ఓపెన్‌ జిమ్స్‌కు కేటాయించి పనులు చేపడుతున్నామని వివరించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 24న జరిగే పట్టణ ప్రగతి దినోత్సవం వరకు నగర అభివృద్ధికి సంబంధించిన ప్రగతి నివేదకను విడుదల చేసి వివరాలను అందిస్తామని మంత్రి కేటీఆర్‌కు మేయర్‌ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని, డివిజన్‌ కమిటీలు పటిష్టంగా పనిచేస్తున్నాయని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కమిషనర్‌ వేణుమాధవ్‌, టౌన్‌ప్లానింగ్‌ డీసీపీ యెల్ల సుభాష్‌, ఈఈ రామన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T05:19:16+05:30 IST