దళితబంధుపై నేడు సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-27T06:30:08+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకం అమలు కార్యాచరణపై శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో చర్చించనున్నారు.

దళితబంధుపై నేడు సీఎం కేసీఆర్‌ సమీక్ష
కరీంనగర్‌ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే రసమయి, మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అధికారులు

- పథకం అమలుకు 2 వేల కోట్లు విడుదల

- హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20,929 కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకం అమలు కార్యాచరణపై శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో చర్చించనున్నారు. దళితబంధు పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ రెండు వేల కోట్ల రూపాయలను కలెక్టర్‌ ఖాతాలో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళితబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పైలట్‌ ప్రాజెక్టు ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం పరిపూర్ణ స్థాయిలో అన్ని కుటుంబాలకు దీనిని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. హుజూరాబాద్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన వెంటనే రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఈ నెల 9న 500 కోట్ల రూపాయలను కలెక్టర్‌ ఖాతాకు విడుదల చేసింది. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలోని శాలపల్లి-ఇందిరానగర్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి  15 మందికి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.  ఈ నెల 23న 500 కోట్ల రూపాయలు, 24న 200 కోట్లు, 25న 300 కోట్లు, 26న 500 కోట్ల రూపాయలను ఎస్సీ కార్పొరేషన్‌ కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాకు జమ చేసింది. దీంతో నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు వారు కోరుకున్న యూనిట్లు స్థాపించుకునేందుకు అవసరమైన నిధులు అందుబాటులోకి వచ్చాయి.  ఈ పథకం కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని హుజూరాబాద్‌ మండలంలో 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్‌ మండలంలోని 4,346 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, వీణవంక మండలంలోని 3,678 కుటుంబాలకు, ఇల్లందకుంట మండలంలోని 2,586 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందనున్నది. 


 20 మంది అధికారులతో సర్వే బృందాలు


ఈ పథకానికి 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడంతోపాటు ఇప్పటికే 20 మంది జిల్లా అధికారుల నేతృత్వంలో మండల, గ్రామ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 27 నుంచి సెప్టెంబరు 2 వరకు ఈ బృందాలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించడానికి వీలుగా కార్యాచరణ సిద్ధం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రతి మండలానికి ముగ్గురు లేక నలుగురు జిల్లా స్థాయి క్లస్టర్‌ అధికారులను వీరి కింద నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక మండలస్థాయి ప్రత్యేక అధికారిని, సహాయ సిబ్బందిని నియమించారు. ఈ సర్వే బృందాలు శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి సర్వే ప్రారంభించి సెప్టెంబరు 2 వరకు కొనసాగిస్తాయి. దళితవాడలోని ప్రతి ఇంటికి వెళ్లి అసవరమైన సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించేందుకు రంగం సిద్ధం చేస్తారు. 


 అధికారులకు సీఎం మార్గదర్శనం


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 27న మధ్యాహ్నం 12:30 గంటలకు కలెక్టరేట్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, దళితబంధు పథకం ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. దళితబంధు పథకానికి హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పెలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నందువల్ల ఇక్కడ వచ్చే క్షేత్రస్థాయి అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకోసం పరిపూర్ణ స్థాయిలో 20 వేల పైచిలుకు కుటుంబాలకు ఇక్కడ ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దళితబంధు పథకం సత్ఫలితాలను సాధించి దళితులు ఆర్థికంగా ఉన్నతస్థానానికి వచ్చేలా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారగణానికి మార్గదర్శనం చేయనున్నారు. ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు దళితబంధు పథకంపై వస్తున్న అభిప్రాయాలను సేకరించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తారు. ముఖ్యమంత్రి తన దృష్టికి వచ్చిన అంశాలను పథకం అమలు చేయాల్సిన తీరుతెన్నులను వారికి వివరిస్తారు. చేపట్టిన ప్రతి యూనిట్‌ ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు వాటి నిర్వహణలో లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వడం, లబ్దిదారుల రక్షణ కోసం నిధిని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. అందుకోసం ఆయన మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు. 


 ముఖ్యమంత్రి పర్యటన వివరాలు..


ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ మీదుగా తీగలగుట్టపల్లిలోని తన నివాస గృహానికి గురువారం రాత్రి చేరుకున్నారు. ఆయన ఉదయం 10:30 గంటలకు అల్గునూర్‌లోని ఏఎంఆర్‌ ఉన్నతి గార్డెన్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ నాయకుడు రూప్‌సింగ్‌ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ఆయన 12:30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకొని దళితబంధు సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మూడు గంటలకు హెలీక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి 3:40 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. 

Updated Date - 2021-08-27T06:30:08+05:30 IST