విద్యాసంస్థల మూసివేత

ABN , First Publish Date - 2021-03-24T06:20:22+05:30 IST

కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మళ్ళీ సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వైద్య కళాశాలలు మినహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలను, హాస్టళ్ళను మూసివేస్తూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

విద్యాసంస్థల మూసివేత

 పెరుగుతున్న కరోనా 

 ఉమ్మడి జిల్లాలో 91 మంది విద్యార్థులకు పాజిటివ్‌

 27 మంది ఉపాధ్యాయులు, ఒక బోధనేతర సిబ్బందికి 

 ఆన్‌లైన్‌ తరగతులు యథాతథం 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)


కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మళ్ళీ సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వైద్య కళాశాలలు మినహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలను, హాస్టళ్ళను మూసివేస్తూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 720 మంది విద్యార్థులు కరోనా వ్యాధిబారిన పడగా కరీంనగర్‌లో 12 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులకు వ్యాధి సోకింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 43 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, పెద్దపల్లి జిల్లాలో ఆరుగురు విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు, ఒకరు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కరోనా బారినపడ్డారు. గత సంవత్సరం మార్చి 2న రాష్ట్రంలో, 16న కరీంనగర్‌ జిల్లాలో కరోనా తొలికేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించి 23 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. జూన్‌ 1వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను దశలవారీగా పొడిగిస్తూ వచ్చారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ను సడలించడంతో కరోనా విజృంభిస్తోంది. 

జిల్లాలో ఈనెల 15వ తేదీ వరకు 25,933 మంది వ్యాధిబారినపడగా 286 మంది మరణించారు. వారంరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు పాఠశాలలు ప్రారంభం కావడం, మరోవైపు శివరాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో జాతరలు జరగడంతో సగటున రోజుకు ఉమ్మడి జిల్లా పరిధిలో 150 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉండడంతో ప్రభుత్వం విద్యార్థులను వ్యాధి బారినపడకుండా చూసేందుకు మళ్ళీ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కరీంనగర్‌ జిల్లాలో 679 ప్రభుత్వం పాఠశాలలు, 12 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 47,875 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రస్తుతం అన్ని పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కరోనా తీవ్రత కొంత తగ్గిన తర్వాత సెప్టెంబర్‌ 1న 6వ తరగతి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించారు. మార్చి 2వ తేదీ వరకు ఉపాధ్యాయులను రోజువిడిచి రోజు పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించారు. మార్చి 3వ తేదీ నుంచి అందరూ ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 9,10 ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించి, ఫిబ్రవరి 24 న 6,7,8 తరగతులకు చెందిన వారికి కూడా విస్తరించారు. మార్చి 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులతోపాటు ప్రత్యక్ష తరగతులను నిర్వహించడం ప్రారంభించారు. ఈ పక్షం రోజుల్లోనే ఉమ్మడి జిల్లా పరిధిలో 91 మంది విద్యార్థులు, 27 మంది ఉపాధ్యాయులు, ఒక బోధనేతర సిబ్బంది కూడా వ్యాధికి గురయ్యారు. దీంతో అంతటా ఆందోళన వ్యక్తమైంది. అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నది. గత సంవత్సరం మార్చి 23న పాఠశాలలను మూసి వేస్తూ నిర్ణయం తీసుకోగా తిరిగి ఈ సంవత్సరం కూడా అదే తేదీ నుంచి పాఠశాలలు మూసివేయడం కాకతాళీయమే అయినా ప్రాధాన్యతను సంతరించుకున్నది. 


తాత్కాలిక సెలవులతో ఇంటిబాట పట్టిన విద్యార్థులు: 


కరోనా మళ్ళీ విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలు, హాస్టళ్లకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, హాస్టళ్ళకు తాళం వేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ విద్యార్థులతో కిటకిటలాడింది.


Updated Date - 2021-03-24T06:20:22+05:30 IST