సిరిసిల్లకు క్లీన్ సిటీ అవార్డు
ABN , First Publish Date - 2021-11-21T05:57:46+05:30 IST
స్వచ్ఛ సర్వేక్షణ్ - 2021 క్లీన్ సిటీ విభాగంలో దక్షిణ భారత దేశంలో సిరిసిల్ల మున్సిపల్ మొదటి స్థానంలో నిలిచింది.

సిరిసిల్ల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్ - 2021 క్లీన్ సిటీ విభాగంలో దక్షిణ భారత దేశంలో సిరిసిల్ల మున్సిపల్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ క్లీన్ సిటీ స్వచ్ఛత అవార్డుల ప్రదానోత్సవంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ చేతుల మీదుగా సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, కమిషనర్ సమ్మయ్య అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి ర్యాంకులో నిలిచి అవార్డును అందుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సమష్టి కృషితో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో మిగతా పట్టణాలకు అదర్శంగా ఉంటామన్నారు. స్వచ్ఛత విషయంలో సహకరించిన మంత్రి కేటీఆర్, పాలకవర్గ సభ్యులు, కమిషనర్, సిబ్బందికి ధన్యావాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీపీవో అన్సారీ తదితరులు పాల్గొన్నారు.