క్రిస్మస్‌కు ముస్తాబు

ABN , First Publish Date - 2021-12-25T05:54:00+05:30 IST

కరుణామయుడు వచ్చే వేళ ఆసన్నమైంది. ప్రేమ, శాంతికి రూపమైన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపు కుంటారు. నెల రోజులుగా జిల్లాలో ముందస్తు సంబరాలు నిర్వహిస్తున్నారు. శనివారం క్రిస్మస్‌ సందర్భంగా అన్ని చర్చిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే చర్చిలను విద్దుద్దీపాలతో అలంకరించారు.

క్రిస్మస్‌కు ముస్తాబు
సిరిసిల్లలో సీఎస్‌ఐ చర్చి

-  విద్యుద్దీపాలతో కాంతులీనుతున్న చర్చిలు 

-  క్రైస్తవులకు దుస్తుల పంపిణీ 

 - నేడు జిల్లా వ్యాప్తంగా వేడుకలు 

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కరుణామయుడు వచ్చే వేళ ఆసన్నమైంది. ప్రేమ, శాంతికి రూపమైన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా  క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపు కుంటారు. నెల రోజులుగా జిల్లాలో ముందస్తు సంబరాలు నిర్వహిస్తున్నారు.  శనివారం క్రిస్మస్‌ సందర్భంగా అన్ని చర్చిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు  వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే చర్చిలను విద్దుద్దీపాలతో అలంకరించారు. శాంతి సందేశాలు ప్రార్థనలతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్‌ సందడి మొదలైంది.  ప్రపంచం అంధకారంలో ఉందని, ఏసు ప్రభువు ఆ చీకటిని దూరం చేసేందుకు జన్మించాడని చాటేందుకు ప్రత్యేకంగా కొవ్వొత్తులను వెలిగిస్తారు. చర్చిలో కొవ్వొత్తులను వెలిగించి ఎనిమిది బైబిల్‌ సూక్తులు, తొమ్మిది పాటలను ఆలపిస్తారు. తేజోమయుడు ఈ లోకానికి వెలుగులు ఇవ్వడానికి వచ్చాడని భావిస్తారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రతి ఇంటా శాంతాక్లాజ్‌ బొమ్మలు, నక్షత్రాలు, క్రిస్మస్‌ చెట్లతో అలంకరించుకుంటారు. చర్చిల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తారు. క్రీస్తు పలుకు వినబడగానే క్రైస్తవుల గుండెల నిండా ఆరాధన భావం వెల్లువెత్తుతుంది. ప్రభుత్వం ఈ సారి కూడా క్రైస్తవులకు కొత్త దుస్తులను అందించింది. 

  గిఫ్ట్‌ ప్యాక్‌లు 

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోని క్రైస్తవులకు క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం  కొత్త దుస్తులకు సంబంధించిన 3400 గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేసింది. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 1900, వేములవాడ నియోజక వర్గంలో 1500 గిఫ్ట్‌ ప్యాక్‌లు అందించారు. వేముల వాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్‌ మం డంలో 550 మంది, వేములవాడ రూరల్‌   150, చందుర్తి 150, రుద్రంగి 100, కోనరావుపేట 250, కథలాపూర్‌ 150, మేడిపల్లి 150 మందికి అందించారు.

 సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల మండలంలో 550 మంది, తంగళ్లపల్లిలో 250 మంది, గంభీరావుపేటలో 250 మంది, ఎల్లారెడ్డిపేటలో 350మంది, వీర్నపల్లిలో 200 మంది, ముస్తాబాద్‌లో 300 మందికి గిప్ట్‌ ప్యాక్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

కాలాన్ని మార్చిన క్రీస్తు పుట్టుక..

ఏసుక్రీస్తు జన్మించిన రోజే క్రిస్మస్‌. ఏసు జననం ప్రపంచ గమనాన్నే మార్చిందని భావిస్తారు. క్రీస్తు పుట్టుకను ఆధారం చేసుకొనే కాలాన్ని రెండుగా పరిగణించారు. అదే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా చెప్పుకోవడం. క్రీస్తు జన్మించి 2014 సంవత్సరాలు గడిచిపోయినా దయామయుడిగా ప్రపంచమంతా ప్రార్థన లు చేస్తున్నారు. 


క్రిస్మస్‌ ట్రీ 

ప్రకృతిని ఆరాధించేలా క్రిస్మస్‌ పండుగ రూపుదిద్దుకుంది. 15వ శతాబ్దం నుంచి క్రిస్మస్‌ ట్రీ ఆచారం ఉంది.  ఓకు చెట్టు కొమ్మలు తెచ్చి దానిని క్రిస్మస్‌ ట్రీగా అలంకరిస్తారు. చెట్టు ఆనందాన్ని, పచ్చదనాన్ని సిరి సంపదలకు చిహ్నంగా భావిస్తారు. క్రిస్మస్‌ చెట్టును ప్యారడైజ్‌ ట్రీగా వ్యవహరిస్తారు. విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. 


శాంతాక్లాజ్‌ సందడి 

క్రిస్మస్‌ వేడుకల్లో అందరినీ ఆకర్షించేది శాంతాక్లాజ్‌. క్రిస్మస్‌ తాత. ఈ తాతనే ఫాదర్‌ నికోలస్‌ అని కూడా పిలుస్తారు. క్రిస్మస్‌ తాత సంప్రదాయం మూడో శతాబ్దంలో మొదలైంది. డెన్మార్క్‌లో సేయింట్‌ నికోలస్‌ అనే ఒక భక్తి పరుడైన ఫాదర్‌ ఉదాంతమే శాంతాక్లాజ్‌ సృష్టికి మూలమని భావిస్తారు. నికోలస్‌ ఉన్న ప్రాంతంలో ఒక పేద రైతు ఉండేవాడు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేక అవస్థ పడుతుండేవాడు. అది చూసిన నికోలస్‌ ఒక మూడు బంగారు నాణేలు మూట కట్టి ఎవరికీ తెలియకుండా ఆ ఇంట్లో జారవిడుస్తాడు. ఆ రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అందుకే చిన్నారుల్లో క్రిస్మస్‌ తాత బోలెడు బొమ్మలు, చాక్లెట్లు ఇస్తాడని సంబర పడతారు. 


క్రిస్మస్‌ స్టార్‌ 

క్రిస్మస్‌ ప్రారంభం ముందు నుంచే క్రైస్తవులు తమ ఇళ్ల ఎదుట నక్షత్ర ఆకృతులను అలంకిరంచుకుంటారు. తూర్పు దేశాల వారు క్రీస్తు పుట్టుకకు చిహ్నంగా భావిస్తారు. క్రీస్తు రాకను కాంక్షిస్తూ చర్చిల్లో, ఇళ్లపైనా స్టార్‌లను అలంకరించడం కొనసాగుతోంది. 


కొవ్వొత్తుల వెలుగులు 

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా కొవ్వొత్తుల ఆరాధన కూడా జరుపుతారు. క్యాండిల్‌ లైట్‌గా పిలుస్తారు. డిసెంబరు 24 అర్ధరాత్రి వరకు జాగరణ పాటిస్తారు. ప్రపంచం అంధకారంలో ఉందని, ఏసు ప్రభువు ఆ చీకటిని దూరం చేసేందుకు జన్మించారని చాటేందుకు ప్రత్యేకంగా కొవ్వొత్తులను వెలిగిస్తారు. చర్చిలో కొవ్వొత్తులను వెలిగించి ఎనిమిది బైబిల్‌ సూక్తులు, తొమ్మిది పాటలను ఆలపిస్తారు. తేజోమయుడు ఈ లోకానికి వెలుగులు ఇవ్వడానికి వచ్చాడని భావిస్తారు. 


Updated Date - 2021-12-25T05:54:00+05:30 IST