కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు

ABN , First Publish Date - 2021-12-26T04:51:25+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలని, రైతుల జీవితాలతో అడుకుంటున్నాయని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చంద్రంపేటలో శనివారం రైతు సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు
సిరిసిల్ల చంద్రంపేటలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం

   - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలని,  రైతుల జీవితాలతో అడుకుంటున్నాయని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చంద్రంపేటలో శనివారం రైతు సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు.   ధాన్యం కుప్పలపై రైతుల ప్రాణాల పోతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని,  ఆ  ఊసురు రైతులకు తాకుతుందని  అన్నారు.  రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటాలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో వరి  సాగు చేస్తే ఉరి అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి ప్రచారం  చేసుకుంటోందని అన్నారు. పూర్వ కాలం నుంచి రైతులు వరి  సాగు చేస్తున్నారన్నారు.  వరి  సాగుపై ఆంక్షలు విధిస్తే భవిష్యత్‌లో ధాన్యం దొరకకుండా పోతుందన్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ప్రభుత్వ అస్థులను ప్రైవేటీకరణ పేరిట అమ్ముతోందన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా కలిసి అంబానీ, అధానీలకు అప్పగించారని, వారి చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విఽధంగా దేశంలో రైల్వేను అధాని గ్రూప్‌కు విక్రయించారన్నారు. అంతేకాకుండా మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని,  రైతుల ధర్నాతో కేంద్ర   దిగివచ్చి రద్దు చేసిందని అన్నారు. ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి వంతపాడుతోందని,  రాష్ట్రంలో వరి సాగు చేయవద్దని ప్రకటించడంతో  రైతులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూనే రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.  కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యలను తెలుసుకోవాలనే లక్ష్యంతో రచ్చబండ కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.  వరికి బదులు వాణిజ్య పంటలను సాగు చేస్తే వన్య ప్రాణులనుంచి అ పంటలను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్ధితి ఏర్పాడుతుందన్నారు.  రైస్‌మిల్లరు నిర్ణయించిన ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతాంగం పూర్తిగా నష్టపోతోందన్నారు. యాసంగి పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్‌  రైతులకు అండగా ఉంటుందన్నారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, పట్టణ అఽధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అకునూరి బాలరాజు, బ్లాక్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, అల్లం దేవేందర్‌, నూనె శ్రీనివాస్‌, అసరి బాలరాజు, చౌటపల్లి వేణుగోపాల్‌, గొట్టే రుక్మిణీ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-26T04:51:25+05:30 IST