గొర్రెల పథకానికి ఉప ఎన్నిక ఊపు

ABN , First Publish Date - 2021-07-24T05:41:18+05:30 IST

గొల్ల, కురుమల ఆర్థికాభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపూ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. 2017 జూన్‌ 26న ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది

గొర్రెల పథకానికి ఉప ఎన్నిక ఊపు

  28న హుజురాబాద్‌లో రెండో విడత పంపిణీకి ఏర్పాట్లు 

- 3,656 కుటుంబాలకు లబ్ధి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గొల్ల, కురుమల ఆర్థికాభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపూ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. 2017 జూన్‌ 26న ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రంలోని గొల్లకురుమలందరికీ గొర్రెల యూనిట్లు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రెండేళ్లలో పూర్తికావలసిన ఈ పథకం నాలుగేళ్లుగా మొదటి దశ పంపిణీకే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా 14వేల మంది ఎంపికైన లబ్దిదారులు తమవంతు వాటా డబ్బును ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించినా యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర సరిపోక పోవడంతో పథకం మూలనపడింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పుణ్యమా అని ఈ పథకాన్ని ప్రభుత్వం గాడిలో పెట్టింది. 


రూ. 50 వేలు పెరిగిన యూనిట్‌ ధర


ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీ కులాల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో గొర్రెల యూనిట్‌ ధరను 1,25,000 నుంచి 1,75,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుతలో 3,50 లక్షల గొర్రెల యూనిట్లకు ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు. రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉప ఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌ నియోజకవర్గంలోనే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నది. ఈనెల 28న జమ్మికుంటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 3,656 మంది పెంపకందారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు.


హజూరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పర్యటన


రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రెండు రోజుల క్రితం హుజూరాబాద్‌లో పర్యటించి ఈమేరకు అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలో 2,024 మంది లబ్ధిదారులు తమవంతు వాటా సొమ్ముకు డీడీలు సమర్పించగా మరో 1532 మంది డీడీలు ఇవ్వాల్సి ఉన్నదని సమాచారం. ఒకటిరెండు రోజుల్లో వారంతా ఈ డీడీలను పశుసంవర్ధకశాఖ అధికారులకు అందజేయగానే గొర్రెల యూనిట్ల్లు మంజూరు చేస్తారని తెలిసింది. నియోజకవర్గపరిధిలోని జిల్లాకు చెందిన హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు యాదవ కుటుంబాకు ఈ సమాచారమందించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌ మండలంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా పశుసంవర్థకశాఖ గొర్రెల యూనిట్లను మంజూరు చేయనున్నది. ఈ నియోజకవర్గంలో 3,656 మంది గొల్లకురుమలకు 63.98 కోట్ల లబ్ది చేకూరనున్నది. లబ్దిదారుల వాటా ధనాన్ని తీసివేయగా 52 కోట్ల మేరకు లబ్ది చేకూరనున్నది. హుజురాబాద్‌ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన 22,150 ఓట్లు ఉన్నవి. వీరంతా ఏడు వేలపై చిలుకు కుటుంబాలకు చెందినవారు కాగా మొదటి విడతలో 3,624 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఇప్పుడు 3,656 యూనిట్లను మంజూరు చేస్తుండడంతో దాదాపుగా అన్నికుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. ఇంకా లబ్ది పొందని కుటుంబాలు ఏమైనా ఉంటే వారికి కూడా గొర్రెల యూనిట్లు మంజూరు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావించి ప్రభుత్వం రెండవ విడత గొర్రెల యూనిట్ల పంపిణీకి ఇక్కడ శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు అనుకుంటున్నారు.


మూడేళ్లుగా ఎదురు చూపులు


జిల్లాలో 2017లో మొదటి విడత 13,527 మంది గొర్రెల యూనిట్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. వీరిని లిస్ట్‌ -ఏగా పేర్కొని అందులో 13,136 మందికి గొర్రెల యూనిట్లను సమకూర్చారు. 13,439 మందిని లిస్ట్‌-బిలో యూనిట్లు సమకూర్చాల్సిన వారిగా గుర్తించారు. 2018-19లోనే వీరందరికి గొర్రెల యూనిట్లను సమకూర్చాల్సి ఉన్నది. ప్రభుత్వం 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉన్న యూనిట్‌కు 1,25,000 రూపాయల విలువను ఖరారు చేసింది. మొదటి విడత యూనిట్లను పంపిణీ చేసే సరికి మార్కెట్‌లో గొర్రెల ధర పెరిగిపోయింది. ఇతర జిల్లాల నుంచి వీటిని ఆ ధరకు కొనుగోలు చేసే అవకాశం లేక పోవడంతో పథకం మూలన పడింది. మూడేళ్లుగా గొర్రెల పంపిణీ చేపట్టాలని గొర్రెల పెంపకందారులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ యూనిట్‌ విలువను 1,25000 నుంచి 1,75,000 పెంచడంతో పంపిణీకి మార్గం సుగమమైంది.

Updated Date - 2021-07-24T05:41:18+05:30 IST