తెగుతున్న బంధాలు

ABN , First Publish Date - 2021-05-03T05:08:18+05:30 IST

కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. వైరస్‌ ప్రభావం వల్ల బంధాలు.. అనుబంధాలు తెగుతున్నాయి.

తెగుతున్న బంధాలు

- కరోనాతో చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు

- ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురి వరకూ మృతి

- జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

జగిత్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. వైరస్‌ ప్రభావం వల్ల బంధాలు.. అనుబంధాలు తెగుతున్నాయి. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు, అయిన వారు కరోనాతో మృతి చెందితే.. కనీసం అంత్య క్రియలకూ హాజరుకాలేని దీనపరిస్థితి.  అందరూ ఉండి అనాథ శవాలుగా వదలివేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. జగిత్యాల జిల్లాలో సెకండ్‌ వేవ్‌లో దాదాపుగా కుటుంబంలో ఒక్కరైనా కరోనా బారిన పడి విలవిలలాడుతున్నారు. పలు కుటుంబాల్లో సభ్యులందరికీ సోకుతోంది. ఇందులో పలు కుటుంబా ల్లో ఒక్కరు మృతి చెందుతుండగా, మరికొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు సైతం మృత్యువాత పడుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు మృతి చెందుతుండడంతో ఆ కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతోంది. కుటుంబ పెద్ద మృతి చెందిన ఇళ్లలో విషాధచాయలు అలుముకుంటున్నాయి.

- ఉధృతమవుతున్న కేసులు..

జగిత్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు ఉధృతమవుతున్నాయి. గడిచిన నెల రోజులుగా జిల్లాలో కరోనాకు గురయి మృత్యువాత పడుతున్న సంఖ్య సైతం అధికమైంది. సగటున జిల్లాలో రోజుకు సుమారు 500 నుంచి 600 మందికి కరోనా పాజిటివ్‌గా తేలుతుండగా, కనీసం సగటున ఎనిమిది నుంచి పది మంది మృత్యువాత పడుతున్నారు. సెకండ్‌ వేవ్‌ ఇంటిలో ఒకరికి వస్తే దాదాపుగా కుటుంబ సభ్యులందరికీ సోకుతోంది. ఆలస్యంగా స్పందించిన వారి పరిస్థితి విషమంగా మారుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఒక్కో కుటుంబంలో పలువురు పాజిటివ్‌ బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

- పెరుగుతున్న కరోనా మృతులు..

జిల్లాలో గడిచిన నెల రోజులుగా కరోనా మృతుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. నెల రోజులుగా పాజిటివ్‌ సంఖ్య పెరుగుతుండడంతో పాటు మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. ఒక్కో రోజు ఎనిమిది నుంచి పది మంది మృత్యువాత పడుతున్నారు. కరోనాతో మరణించిన సందర్భాల్లో అంత్యక్రియలకు బంధుమిత్రులు సైతం హాజరుకావడానికి జంకుతున్నా రు. అందరూ ఉండి అనాథ శవాల్లా అంతిమ సంస్కా రాలు జరుపుతున్న సంఘటనలు హృదయాలను కలిచివేస్తున్నాయి. ఇలా జిల్లాలో కరోనా మహమ్మారితో పలు కుటుంబాలు, గ్రామాల్లో విషాదం నెలకొంటుంది.


 జిల్లాలో మచ్చుకు కొన్ని సంఘటనలు..

-  జగిత్యాలలో ఒకే ఇంట్లో ఏప్రిల్‌ 14వ తేదీన 37 సంవత్సరాల వయస్సు గల కుమారుడు, ఏప్రిల్‌ 17వ తేదీన తండ్రి(70),  20వ తేదీన మరో కుమారు డు(40) మృతి చెందారు. ఒకే ఇంట్లో తండ్రి ఇరువురు కుమారులు మృతి చెందడం విషాదం నింపింది.

- జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్‌, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అయిన భార్యాభర్తలు ఐదు రోజుల వ్యవధిలో మృతి చెందారు.

- జగిత్యాల మండలంలోని చల్‌గల్‌లో ఇరువురు దంపతులు మూడు రోజుల వ్యవధిలో మృతి చెందారు.

- జగిత్యాల పట్టణంలో ఏప్రిల్‌ 6వ తేదీన వృద్ధురాలు (67), ఆమె భర్త(78)  ఏప్రిల్‌ 19న మృతి చెందారు.

- రాయికల్‌ పట్టణంలో ఏప్రిల్‌ 18వ తేదీన దంపతులు  మృతి చెందారు.

- రాయికల్‌ మండలంలోని కట్కాపూర్‌లో ఓ ఇంట్లో ఏప్రిల్‌ 9వ తేదీన కుమారుడు, 18వ తేదీన తండ్రి మృతి చెందారు. తొమ్మిది రోజుల తేడాతో తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం విలవిలలాడుతోంది.

- ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లిలో ఏప్రిల్‌ 27వ తేదిన ఓ పూజారి(55), ఆయన స్నేహితుడు (58) మృతి చెందారు. మృత్యువులోనూ స్నేహబందం వీడకపోవడం పలువురిని కలిచివేసింది.

- వెల్గటూర్‌ మండలంలోని స్తంభంపల్లి గ్రామం లో ఈనెల 1వ తేదిన 45 సంవత్సరాలు కలిగిన ఓ వ్యక్తి మృతి చెందాడు.  ఇతని సోదరుడు(43)  సుమారు పక్షం రోజుల క్రితం కరోనా సోకి మృతి చెందాడు. 

- నిబంధనలు పాటించాలి..

జిల్లాలో కరోనా కట్టడికి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరాలు అందించాలి. కరోనా నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటించాలి. రాత్రి కర్ఫ్యూ సమయంలో బయటకు రాకుండా ఉండాలి. విధిగా మాస్క్‌ ధరించాలి. శానిటైజర్‌ వినియోగించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. కొన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్‌ డౌన్‌ పాటిస్తుండడంతో కేసుల సంఖ్య తగ్గుతోంది. 


- విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి..

 చాలా కుటుంబాల్లో ఒకరిద్దరికి కరోనా పాజిటివ్‌ వస్తోంది. వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉంటూ సమయానికి మందులు వాడుతూ, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కొవిడ్‌ను జయిస్తున్నారు. చనిపోయిన వారి గురించి ఆందోళన చెందకుండా, కరోనా విజేతలను స్ఫూర్తిగా తీసుకొని దైర్యంగా వ్యవహరించాల్సిన అవసరముంది.


Updated Date - 2021-05-03T05:08:18+05:30 IST