సిరిసిల్ల జిల్లాలో సంబరంగా బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2021-10-07T06:45:28+05:30 IST

జిల్లాలో చిన్నబతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం సిరిసిల్లలో బతుకమ్మ ఘాట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సిరిసిల్ల జిల్లాలో సంబరంగా బతుకమ్మ వేడుకలు
వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

- వేములవాడ ఆలయం వద్ద మహిళల ఆటాపాట

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )

జిల్లాలో చిన్నబతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం సిరిసిల్లలో బతుకమ్మ ఘాట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు పల్లెలన్నీ పూలతోటగా మారాయి. ఆటలు, పాటలతో మహిళలు ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ ఘాట్‌ సిరిసిల్ల మానేరు వాగు వద్ద మహిళలు బతుకమ్మలతో అడిపాడారు. మున్సిపల్‌ అధికారులు బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. డీజే సౌండ్ల ద్వారా బతుకమ్మ పాటలు వినిపించారు. బతుకమ్మను ఆడడంతో పాటు నిమజ్జనం చేశారు. బతుకమ్మ వేడుకల్లో మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు అయ్యారు. భారీ వర్షాలతో వాగులు, ఒర్రెలు, చెరువులు నిండుకుండలా మారడంతో పోలీ సులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీ కన్యకా పరమేశ్వరిదేవాలయం, శ్రీ సాయిబాబా దేవాలయం, శ్రీ విశ్వనాథ దేవాలయంతో పాటు వెంకంపేట, సంజీవయ్యనగర్‌, పద్మనగర్‌, సర్ధార్‌నగర్‌, సుందరయ్యనగర్‌, బీవైనగర్‌, ఇందిరానగర్‌, సాయినగర్‌, సుభా్‌షనగర్‌, నెహ్రూనగర్‌, విద్యానగర్‌, గీతానగర్‌, అంబేద్కర్‌నగర్‌, శాంతినగర్‌లలో బతుకమ్మ సంబరాలు జోరుగా సాగా యి. సిరిసిల్ల మానేరు తీరంలో బతుకమ్మలను సాగనంపారు. 

వేములవాడ : ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగ సంబరాలు వేములవాడలో బుధవారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక  బతుకమ్మ ఉత్సవాల తొలిరోజు తంగేడుపూలు, గునుకపూలు, బొడ్డెమ్మలతో అందమైన బతుకమ్మను పేర్చిన మహిళలు సాయంత్రం వేళలో ఇంటి ముంగిళ్లలో బతుకమ్మ ఆడారు. అనంతరం వీధి కూడలిలో, తదు పరి శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో బతుకమ్మ ఆడారు. తదుపరి ఆలయ ధర్మగుండంలో, మూలవాగులోని నీటి ప్రవాహంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం మహిళలు, బాలికలు ఆలయ ఆవరణలో కోలాటం, దాండియా ఆడారు. 


Updated Date - 2021-10-07T06:45:28+05:30 IST