బాలుడి కిడ్నాప్‌నకు యత్నం

ABN , First Publish Date - 2021-03-24T06:38:46+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చిన నాలుగేళ్ల బాలుడు చరణ్‌ను కిడ్నాప్‌నకు యత్నించిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.

బాలుడి కిడ్నాప్‌నకు యత్నం
తల్లి చెంతకు చేరిన బాలుడు చరణ్‌



-వేములవాడలో రెండు గంటల పాటు హైరానా -బాలుడు దొరకడంతో ఊపిరి పీల్చుకున్న బంధువులు


వేములవాడ, మార్చి23: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చిన నాలుగేళ్ల బాలుడు చరణ్‌ను కిడ్నాప్‌నకు యత్నించిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. దాదాపు రెండు గంటల పాటు తల్లి హైరానా పడగా ఎట్టకేలకు బాలుడు ఆచూకీ తెలియడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన బానోత్‌ జీత్య-కౌశల్య దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాజన్న దర్శనం కోసం వేములవాడకు వచ్చారు. వీరి కుమార్తె అజ్మీరా శైలజ కూడా తన పిల్లలతో కలిసి వీరితో పాటు వేములవాడకు వచ్చింది. దర్శనం అనంతరం మంగళవారం పార్కింగ్‌ స్థలంలో విడిది చేసి వంటలు చేసుకున్నారు. భోజనాల అనంతరం సాయంత్రం సమయంలో శైలజ కుమారుడు చరణ్‌(4) కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోవడంతో మైక్‌ ద్వారా ప్రచారం చేసేందుకు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వద్ద దుప్పట్ల కింద బాబును చూసినట్లు కొందరు చెప్పడంతో అక్కడ వెతకగా దుప్పట్ల కింద ఉన్న చరణ్‌ కనిపించాడు. రెండు గంటల హైరానా అనంతరం చరణ్‌ కనిపించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించగా కిడ్నాప్‌నకు యత్నించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. చరణ్‌ తల్లి శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ వెంకటేశ్‌ తెలిపారు.

Updated Date - 2021-03-24T06:38:46+05:30 IST