నిందితుడిని శిక్షించాలి

ABN , First Publish Date - 2021-10-31T06:23:50+05:30 IST

ఎల్లారెడ్డిపేట మండ లంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని శిక్షించాలని, బాధిత కుటుం బానికి న్యాయం చేయాలని అఖిలపక్షం, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

నిందితుడిని శిక్షించాలి
సిరిసిల్లలో రాస్తారోకో చేస్తున్న అఖిల పక్షం, దళిత, గిరిజన సంఘాల నాయకులు

- అఖిలపక్షం, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌

-  బాలికపై అత్యాచార ఘటనపై ఆగ్రహం

- జిల్లా కేంద్రంలో  రాస్తారోకో 

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 30: ఎల్లారెడ్డిపేట మండ లంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని శిక్షించాలని, బాధిత కుటుం బానికి న్యాయం  చేయాలని అఖిలపక్షం, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద  శనివారం బాధిత కుటుంబంతో కలిసి రాస్తారోకో చేశారు.   ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నిందితుడిని కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆరోపించారు. సంఘటన జరిగి రెండు రోజుల గడుస్తున్నా జిల్లా మంత్రి కేటీఆర్‌,  అధికారులు స్పం దించక పోవడం విచారకరమన్నారు. కనీసం టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు  బాధిత కుటుంబాన్ని  పరామర్శించ లేదన్నారు.  నిందితుడు బయటకొస్తే సాక్షులను తారు మారు చేస్తాడన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం  రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని, గ్రామాల్లో బెల్టు షాప్‌లు, మద్యం దుకాణాలను మూసివేయించాలని డిమాండ్‌ చేశారు. మహిళలు నిందితుడి ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి నిప్పంటించారు.  అనంతరం  అక్కడికి చేరుకున్న  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌  బాధితుల డిమాండ్‌లను సానుకూలంగా విన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. తక్షణ సహాయంగా రూ.25వేలు ఇస్తామన్నారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించి వెళ్లారు. అయితే  సాయంత్రం వరకు కూడా రాస్తారోకోను విరమించక పోవడంతో అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీఎస్పీ బాధిత కుటుంబంతో మాట్లాడారు. తక్షణ సహాయంగా లక్ష రూపాయాలు, డబ్బుల్‌ బెడ్‌ రూం ఇస్తామని, నిందితుడిని చట్టపరంగా శిక్షిస్తామని  హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అంతకు ముందు రాస్తారోకోతో  కిలో మీటర్‌ వరకు వాహనాలు స్తంభించాయి.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌ నాయక్‌, శీలం రాజు, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, సీపీఐ జిల్లా నాయకుడు పంతం రవి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎనగందుల వెంకన్న, మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆవూనూరి ప్రభాకర్‌, కానాపురం లక్ష్మణ్‌,  దళిత లిబరల్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్‌, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌ నాయక్‌, కరీంనగర్‌ జిల్లా గిరిజన జేఏసీ చైర్మన్‌ బీమా సాహెబ్‌, లంబాడీ ఐక్య వేదిక నరేష్‌నాయక్‌, లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గజల్‌నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయ కులు, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్యెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట ధర్నా

సిరిసిల్ల ఎమ్యెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట బీజేపీ, ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. గిరిజన బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఎమ్యెల్యే క్యాంప్‌ కార్యాల యంలో ఎమ్మెల్సీ,  టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య విలేకరుల సమావేశం నిర్వహి స్తున్నట్లు తెలుసుకున్న బీజేపీ, ఏబీవీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి భర్తను పార్టీ నుంచి, రైతు బంధు సమితి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా రూ.50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బైఠాయించారు. దీంతో పోలీసులు బలవంతగా బీజేపీ, ఏబీవీపీ నాయకులను పోలీస్టేషన్‌కు తరలిం చారు. అరెస్టు అయిన వారిలో బీజేపీ, ఏబీవీపీ నాయ కులు రంజిత్‌, తిరుపతి, యాదగిరి, లక్ష్మారెడ్డి, మనుకుమార్‌, గణేష్‌, శ్రీనివాస్‌, వేణు, కృష్ణహరి, నరేష్‌ పాల్గొన్నారు.

ఫ గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో బీఎస్పీ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో చేపట్టారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.  ఈ సంఘటనపై అధికార పార్టీ నేతలు స్పందించక పోవడంపై మండి పడ్డారు. బీఎస్పీ మండల నాయకుడు రాజబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు కళ్యాణ్‌కుమార్‌, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, బీఎస్పీ నాయకులు పర్శారామ్‌, రాజేష్‌, సతీష్‌, తిరుపతి తదితరులు ఉన్నారు. 

 ఫ వేములవాడ టౌన్‌  : ఎల్లరెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో చిన్నారి అత్యాచార ఘటనలో నిందితుడిని శిక్షించాలని  వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ జిల్లా ఇన్‌చార్జి రాము  డిమాండ్‌ చేశారు.  వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి నందికమాన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మహిపాల్‌, జింక ఎల్లయ్య తదితరులు ఉన్నారు. 

 ఫ కోనరావుపేట: చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా  డిమాండ్‌ చేశారు.   కోనరావు పేట మండలం కేంద్రంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.   కాంగ్రెస్‌ నాయకులు బొర్ర రవీందర్‌, లింబయ్య, గొట్టె రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T06:23:50+05:30 IST