పేరుకుపోతున్న చెత్తాచెదారం
ABN , First Publish Date - 2021-03-22T05:08:29+05:30 IST
పట్టణాలు, నగరాల్లోని డంపింగ్‌యార్డుల్లో రోజురోజుకు చెత్తాచెదారం పేరుకుపోతోంది.

- డంపింగ్ యార్డు కాలుష్యంతోజనం సతమతం
- జీహెచ్‌ఎంసీ తరహాలో ‘బయోమైనింగ్’కు యోచన
- కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు చర్యలు
- కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీలో ప్రతిపాదన
- బయోమైనింగ్‌తో శాశ్వత పరిష్కారం దొరికేనా...!
కరీంనగర్ టౌన్, మార్చి 21: పట్టణాలు, నగరాల్లోని డంపింగ్‌యార్డుల్లో రోజురోజుకు చెత్తాచెదారం పేరుకుపోతోంది. డంపింగ్ యార్డుల నుంచి వస్తున్న కాలుష్యంతోపాటు, తరచూ చెత్తాచెదారం అగ్నికి ఆహుతవుతుండడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పట్టణాలు, నగరాల్లోని చెత్త సమస్యను పరిష్కరించేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు చెత్తను తగ్గించే చర్యలు చేపడుతున్నారు. అలాగే తడి చెత్తతో సేంద్రియ ఎరువు, పొడిచెత్తతో విద్యుత్పుత్తి చేస్తున్నారు. అయినప్పటికీ రోజురోజుకు భారీగా వెలువడుతున్న చెత్తతో డంపింగ్‌యార్డులు గుట్టలుగా మారి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం బయో మైనింగ్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో బయో మైనింగ్ ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌యార్డుల్లోని చెత్తను తొలగించి స్థలాలను వినియోగంలోకి తెచ్చారు. అదే తరహాలో రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కూడా బయోమైనింగ్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు మరో 10 మున్సిపాలిటీల్లో బయోమైనింగ్‌కు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో స్మార్ట్‌సిటి పథకంలో బయోమైనింగ్ విధానాన్ని అమలు చేసేందుకు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో రోజు 150 నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా అందులో 80శాతం డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. డంపు యార్డును మూసివేసి తడి చెత్తను సేంద్రియ ఎరువు కోసం వర్మీ కంపోస్టుయార్డులకు, పొడి చెత్తను ఇతర అవసరాలకు తరలించాలని ప్రతిపా దనల్లో పేర్కొన్నారు. దీంతో డంపింగ్ యార్డుతో గాలి, నీరు, నేల కాలుష్యాన్ని నివారించ డానికి అగ్ని ప్రమాదాలను నియంత్రించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్‌హౌస్ గ్యాస్(జీహెచ్‌జీ) ఉద్గారాలను తగ్గించే ప్రయత్నా లకు దోహదం చేస్తుంది.
దీంతో యార్డు సమీపంలోని ప్రజలకు కాలుష్యం తగ్గడం, ల్యాండ్‌ఫిల్ గ్యాస్ ఉద్గారాల నుంచి నివారణ కలుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని డంపు యార్డులోని వ్యర్థాల పరిమాణం సుమారు 1.4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుంది. బయో మైనింగ్ ప్రక్రియ నుంచి కోలుకున్న పదార్థం నాణ్యత ప్రకారం రీసైక్లింగ్ కోసం పంపిస్తారు. పర్యావరణానికి హాని జరగకుండా చూసుకోవ డానికి పరీక్షిస్తారు. పునర్వినియోగ పరచలేని ప్లాస్టిక్ పదార్థం ఆర్‌డీఎఫ్ యూనిట్లు, లేదా సిమెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. బయోమైనింగ్ విధానంతో అనేక ప్రయోజనాలున్నందున స్మార్ట్‌సిటీలో దీనికి ఆమోదం ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలను పంపించారు. రామగుండం కార్పొరేషన్‌తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో కూడా బయోమైనింగ్ విధానంతో డంపింగ్‌యార్డులో పేరుకు పోయిన చెత్తను తొలగించడంతోపాటు చెత్తను రీసైక్లింగ్ చేసి ఆదాయాన్ని కూడా పెంచుకునేందుకు అవకాశాలున్నందున ప్రభుత్వం త్వరగా దీనికి ఆమోదం తెలిపి పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.