టిక్‌టాక్‌లో పరిచయం.. యువతి పెళ్లికి ఒప్పుకోలేదని..!

ABN , First Publish Date - 2021-05-30T18:46:21+05:30 IST

అతడికి టిక్‌టాక్‌ వీడియోలు తీయడం సరదా..

టిక్‌టాక్‌లో పరిచయం.. యువతి పెళ్లికి ఒప్పుకోలేదని..!

హైదరాబాద్‌ సిటీ : అతడికి టిక్‌టాక్‌ వీడియోలు తీయడం సరదా.. అలాగే టిక్‌టాక్‌ వీడియోలు చేసే యువతులతో పరిచయం పెంచుకుంటాడు. సన్నిహితంగా ఉంటూ ఫొటోలు, వీడియోలు సేకరించి వేధింపులకు గురిచేస్తాడు. ఇదేవిధంగా నగరానికి చెందిన యువతిని వేధింపులకు గురిచేసిన ఇతడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.


తాడిపత్రి ప్రాంతానికి చెందిన పులుకూరు నవీన్‌ (23) లా రెండో సంవత్సరం చదువుతూ ఓ సంస్థలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఇతడు టిక్‌టాక్‌ వీడియోలు పెడుతూ యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపేవాడు. యాక్సెప్ట్‌ చేసిన వారితో చాటింగ్‌ చేస్తూ పరిచయం పెంచుకునేవాడు. వారి వ్యక్తిగత వివరాలు సేకరించి వేధింపులకు గురిచేసేవాడు. ఓ సోషల్‌ యాప్‌లో శంకరపల్లి ప్రాంతానికి చెందిన యువతికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడు. యాక్సెప్ట్‌ చేసిన యువతితో తరచూ చాటింగ్‌, ఫోన్‌ చేసి మాట్లాడేవాడు. పరిచయం పెంచుకొని ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు సేకరించాడు. 


తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఆమె కుటుంబ సభ్యులను హతమార్చుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి అత్త అతన్ని హెచ్చరించింది. దాంతో ఆమెపై కక్ష పెంచుకున్న నవీన్‌ వర్చువల్‌ ఫోన్‌ నెంబర్‌ ద్వారా ఫోన్‌ చేయడం, అసభ్యకర మెసేజ్‌లు పెట్టి వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా యువతి ఫొటో, ఫోన్‌ నెంబర్‌తో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీని తయారు చేశాడు. ఆమె గురించి అసభ్యకరంగా రాయడంతో ఆమెకు అనేక మందినుంచి ఫోన్‌లు రావడం ప్రారంభమయ్యాయి. దాంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేసి తాడిపత్రికి చెందిన నవీన్‌గా గుర్తించారు. రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు శనివారం నిందితుడు నవీన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-05-30T18:46:21+05:30 IST