రెండు పదుల వయస్సులోనే పోర్న్‌ సైట్స్‌కు బానిసై...!

ABN , First Publish Date - 2021-06-22T12:34:34+05:30 IST

రెండు పదుల వయస్సులోనే పోర్న్‌ సైట్స్‌ ఎక్కువగా చూస్తూ..

రెండు పదుల వయస్సులోనే పోర్న్‌ సైట్స్‌కు బానిసై...!

  • మహిళలకు వేధింపులు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ఖాతాలతో బెదిరింపులు
  • యువకుడి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌ : వివిధ పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ అకౌంట్లను సృష్టించి అందమైన మహిళలను టార్గెట్‌ చేసి ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ సోమవారం అతన్ని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పరిధిలోని గుండూర్‌ గ్రామానికి చెందిన మొగిలి ఆంజనేయులు(21) ఓప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తూ కొత్తపేటలో నివాసముంటున్నాడు. పలు పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్‌మీడియాలో నాలుగైదు అకౌంట్లు తెరిచాడు. ఇటీవల సంజీవరెడ్డి నగర్‌కు చెందిన మహిళ ఇన్‌స్టాగ్రామ్‌కు ఆదివారం రాత్రి ఒక మెసేజ్‌ వచ్చింది. 


తనతో క్రేజీచాట్‌ చేసే ఆసక్తి ఉందా? అనేది మెసేజ్‌లోని సారాంశం. అయితే అందుకు మహిళ తిరస్కరిస్తూ రిప్లై చేసింది. ఇకఅంతే.. క్రమంగా వేధింపులు మొదలయ్యాయి. మోడల్స్‌, హీరోయిన్స్‌ న్యూడ్‌ ఫొటోలతోపాటు, మహిళ కాంటాక్ట్‌ లిస్టు కూడా స్ర్కీన్‌షాట్‌ తీసి పంపించాడు. దీంతో వెంటనే ఆమె ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. ఇంతలో మరో గుర్తుతెలియని అకౌంట్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ఇలా ఆమె బ్లాక్‌ చేయడం, కొత్త అకౌంట్ల నుంచి మెసేజీలు రావడం కొనసాగింది. చివరగా ఆమె స్నేహితురాలి కూతురు ఫొటోను మార్ఫింగ్‌ చేసి న్యూడ్‌ ఫొటోగా చిత్రీకరించి పంపించడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. రాత్రంతా నిద్రలేకుండా తీవ్ర భయందోళనకు గురైన మహిళ సోమవారం ఉదయమే సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదుచేసింది.


ఆమె ఇచ్చిన వివరాలు, ఆధారాలతో రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్స్‌ మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో గంటలోనే నిందితుడు, అతడు ఉండే లొకేషన్‌ను గుర్తించారు. విపరీతమైన శృంగార వాంఛతోనే నిందితుడు సైకోగా మారిపోయాడని, రెండు పదుల వయస్సులోనే పోర్న్‌ సైట్స్‌ ఎక్కువగా చూస్తూ మతితప్పిన వాడిలా తయారయ్యాడని సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. అతడి బారిన ఎంతమంది పడ్డారో తేలాల్సి ఉందని, త్వరలోనే కస్టడీకి తీసుకుని తేలుస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-22T12:34:34+05:30 IST