Operation వికటించి మహిళ మృతి.. 25లక్షల పరిహారమిచ్చేందుకు ఆస్పత్రి ఒప్పందం!
ABN , First Publish Date - 2021-12-15T17:40:14+05:30 IST
Operation వికటించి మహిళ మృతి.. 25లక్షల పరిహారమిచ్చేందుకు ఆస్పత్రి ఒప్పందం!

హైదరాబాద్ సిటీ/ఎల్‌బీనగర్ : ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని వైద్యులు నిర్వహించిన గర్భసంచి ఆపరేషన్ వికటించి ఓ మహిళ మంగళవారం మృతి చెందింది. మృతురాలి బంధువుల ఆందోళనతో దిగొచ్చిన ఆస్పత్రి యాజమాన్యం రూ.25లక్షల పరిహారాన్ని చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బాధితుల వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొనేజెడి గ్రామానికి చెందిన శ్రీనివాస్, వరలక్ష్మీ దంపతులు నగరానికి వలసవచ్చి బ్యాంకుకాలనీలో నివాసముంటున్నారు. వారం రోజుల క్రితం ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భసంచి ఆపరేషన్ కోసం వరలక్ష్మి అడ్మిట్ అవ్వగా, వైద్యులు ఆపరేషన్ చేశారు.
మూడు రోజుల అనంతరం ఆమె పరిస్థితి విషమంగా మారింది. దాంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించగా, మలక్‌పేటలోని ఓ ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ వికటించి పేగుకు రంధ్రం పడిందని వివరించారు. పరిస్థితి విషమించి వరలక్ష్మి మృతి చెందింది. మృతదేహాన్ని ఎల్‌బీనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఉంచి బంధువులు ఆందోళనకు దిగారు. రూ.25లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన ఆస్పత్రి యాజమాన్యం తొలుత రూ.3లక్షలు ఇవ్వగా, విడతల వారీగా జనవరిలోపు మిగతా రూ.22లక్షలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు.