HYD : నీళ్లు.. నిధులు.. పుష్కలం.. ఈ ఏడాది కలిసొచ్చింది..!

ABN , First Publish Date - 2021-12-30T16:58:09+05:30 IST

వాటర్‌బోర్డుకు ఈ ఏడాది కలిసొచ్చిన కాలమనే చెప్పాలి. అనుకున్నదానికంటే...

HYD : నీళ్లు.. నిధులు.. పుష్కలం.. ఈ ఏడాది కలిసొచ్చింది..!

  • రూ. 1450 కోట్లతో సుంకిశాల ఇన్‌టెక్‌ చానల్‌ పనులు
  • అమల్లోకి ఉచిత తాగునీటి పథకం

హైదరాబాద్‌ సిటీ : వాటర్‌బోర్డుకు ఈ ఏడాది కలిసొచ్చిన కాలమనే చెప్పాలి. అనుకున్నదానికంటే ఎక్కువ ప్రగతినే సాధించింది. భారీ వర్షాలకు నగరంలోని జలాశయాలు కళకళలాడుతున్నాయి. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ లేని విధంగా సుమారు రూ. ఏడు వేల కోట్ల నిధులు మంజూరు చేసింది. దేశంలో ఉచిత తాగునీటిని అందించే నగరాల్లో ఢిల్లీ తర్వాత రెండో నగరంగా హైదరాబాద్‌ చేరింది. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన గృహ కనెక్షన్‌కు నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం ఈ ఏడాది ప్రారంభంలోనే అమల్లోకి వచ్చింది. కరోనా సెకండ్‌ వేవ్‌ వాటర్‌బోర్డు ఉద్యోగులపై ప్రభావం చూపగా, వివిధ ప్రాంతాల్లో సుమారు 23 మంది వరకు సిబ్బంది విధి నిర్వహణలో అసువులు బాశారు.


వాటర్‌ బోర్డు ఆధ్వర్యంలో సుంకిశాల ఇన్‌టెక్‌ ఛానల్‌ పనులను రూ.1450 కోట్లతో ప్రారంభించింది. కోర్‌సిటీలోని జోన్‌-3లో సివరేజీ పనులను రూ.300 కోట్లతో చేపట్టారు. మురుగునీటి శుద్ధిలో భాగంగా 31 ఎస్టీపీల నిర్మాణానికి రూ.3866.21 కోట్ల పనులకు అనుమతులు రాగా, టెండర్‌ ప్రక్రియ తుది దశకు చేరింది. మంచినీటి శాశ్వత పరిష్కారంలో భాగంగా ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు ఫేజ్‌-2 కింద రూ.1200 కోట్లతో ఇటీవలే టెండర్లు ఖరారయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. 


ఉచిత తాగునీరు..

గ్రేటర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న జీహెచ్‌ఎంసీ పరిధిలో గృహ కనెక్షన్లకు నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో అర్హులైన 9,73,977 నల్లా కనెక్షన్లలో ఇప్పటి వరకు సుమారు 5లక్షల గృహ కనెక్షన్లు చేరాయి. ఈ నెల 31 వరకు గడువు ఉండడంతో మరిన్ని కనెక్షన్లు చేరే అవకాశాలున్నాయి.


ప్రభావం చూపిన సెకండ్‌ వేవ్‌..

కరోనా సెకండ్‌ వేవ్‌ వాటర్‌బోర్డుపై ప్రభావం చూపింది. క్షేత్రస్థాయిలో పని చేసే పలువురు ఉద్యోగులు కరోనా బారినపడగా, కొందరు చనిపోయారు. మేనేజర్లుగా పని చేసిన విజయ్‌కుమార్‌, విజయ్‌సాగర్‌లతో పాటు మరో 21 మంది వారిలో ఉన్నారు. ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హెల్త్‌ కార్డులను ఈ ఏడాది అందించారు. దీని కోసం ఏటా రూ.6.78 కోట్ల ప్రీమియం వాటర్‌బోర్డు చెల్లిస్తోంది. సుమారు పది వేల మంది కుటుంబ సభ్యులకు లబ్ది చేకూరనుంది.


మూడేళ్లలో రూ.2 వేల కోట్లు..

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ మూడేళ్లలో రూ.2 వేల కోట్లను వ్యయం చేసింది. బాచుపల్లి నుంచి మల్లంపేట మీదుగా బౌరంపేట వరకు రోడ్డు విస్తరణ మల్లంపేట వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి ఎంట్రీ, ఎగ్జిట్‌ ర్యాంప్‌లతో రహదారిని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.


బాలానగర్‌ ప్లైఓవర్‌, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌తో ట్యాంక్‌ బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దడం పూర్తయ్యింది. బాట సింగారం, మంగళ్‌పల్లిలో లాజిస్టిక్‌ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై 132 కిలోమీటర్ల మేర విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ఔటర్‌పై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఫాస్టాంగ్‌ వ్యవస్థతో టోల్‌ నిర్వహణలు చేపట్టారు. ఉప్పల్‌, ఏఎ్‌సరావునగర్‌, ఐడీపీఎల్‌ కాలనీలో మూడు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు పూర్తయ్యాయి. ఉప్పర్‌పల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుండి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేకు ఉప్పర్‌పల్లి వద్ద అప్‌ ర్యాంప్‌, డౌన్‌ ర్యాంప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లక్ష్మీనగర్‌ వద్ద పీవీఎన్‌ఆర్‌ డౌన్‌ ర్యాంప్‌ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఉప్పల్‌, మెహిదీపట్నంలలో రెండు ఎలివేటెడ్‌ స్కైవాక్‌ పనులు వేగంగా సాగుతున్నాయి.

Updated Date - 2021-12-30T16:58:09+05:30 IST