‘ఉస్మానియా’లోకి.. నో ఎంట్రీ.. డిసెంబర్-01 నుంచి అమల్లోకి.. రూ. 200 చెల్లించాల్సిందే..

ABN , First Publish Date - 2021-11-28T14:28:26+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల కార్యక్రమాలపై...

‘ఉస్మానియా’లోకి.. నో ఎంట్రీ.. డిసెంబర్-01 నుంచి అమల్లోకి.. రూ. 200 చెల్లించాల్సిందే..

  • విద్యార్థులు, సిబ్బందికి గుర్తింపు కార్డులు
  • వాకర్లు రూ.200 చెల్లిస్తే నెల పాస్‌
  • ఏ మైదానం వినియోగించినా చార్జీలే

హైదరాబాద్‌ సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల కార్యక్రమాలపై ఆంక్షలు విధించిన అధికారులు, తాజాగా వర్సిటీలో భద్రత డిసెంబరు-01 నుంచి ఆంక్షలు అమలు చేసేందుకు పచ్చజెండా ఊపారు. యూనివర్సిటీ జారీ చేసే పాస్‌ ఉన్నవారిని మాత్రమే క్యాంపస్‌లోకి అనుమతించనున్నారు. ఇందుకోసం వర్సిటీ అధ్యాపకులు, సిబ్బందికి, విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు.


పాస్‌లు ఉంటేనే.. 

ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకర్లకు అనుమతి. కానీ, నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ కోసం నెలకు ఒక్కొక్కరు రూ.500 చెల్లించాలి. సెంటర్‌ ఫర్‌ ఫిట్‌నెస్‌లో జిమ్‌ను ఇతరులు వినియోగించుకుంటే నెలకు రూ.1000, 3 నెలలకు రూ.2500, 6 నెలలకు రూ.5 వేలు, ఏడాదికి రూ.10 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని వర్సిటీ అధికారులు శనివారం ప్రకటించారు. వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


21 అంశాలతో రోడ్‌మ్యాప్‌..

నాలుగు నెలల కిందట ఉస్మానియా వర్సిటీకి నూతన ఉపకులపతి వచ్చారు. యూనివర్సిటీ అభివృద్ధికి 21 అంశాలతో రోడ్‌మ్యా్‌పను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వర్సిటీలో ఎన్నో ఆంక్షలు విధిస్తూ సరికొత్త విధానాలకు తెరతీశారు. ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట ఆందోళనలు, ధర్నాలతో విద్యా వాతావరణం దెబ్బతింటుందనే సాకుతో ఆంక్షలు విధించారు. వర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడితే భద్రతాధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలపై కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి ఏపీలో ఉద్యమం సాగిన సందర్భంలో లేని ఆంక్షలు ఇప్పుడు స్వరాష్ట్రంలో విధించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రాత్రి 8 గంటలకు రోడ్డు బంద్‌

వర్సిటీలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకంటూ ఇతరులకు ప్రవేశం లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి హబ్సిగూడ, రామంతాపూర్‌, డీడీకాలనీ, మాణికేశ్వరనగర్‌ కాలనీల వైపు ఉన్న మార్గాలను పూర్తిగా మూసేశారు. కేవలం వర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ ముందు గల గేటు నుంచి, ఎన్‌సీసీ గేటు నుంచి రాకపోకలకు అవకాశం కల్పించారు. ఈ గేట్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా మూసేసి వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రత్యేకమైన గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నారు.

Updated Date - 2021-11-28T14:28:26+05:30 IST