సమస్యల్లో స్కూళ్లు
ABN , First Publish Date - 2021-08-25T07:08:10+05:30 IST
హైదరాబాద్ జిల్లాలో 861, రంగారెడ్డిలో 1308, మేడ్చల్‌లో 503 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి.

పలు చోట్ల శిథిలావస్థకు..
హైదరాబాద్ సిటీ న్యూస్‌నెట్‌వ్కర్క్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లాలో 861, రంగారెడ్డిలో 1308, మేడ్చల్‌లో 503 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. 2020-21 గణంకాల ప్రకారం 3 జిల్లాల్లో మొత్తం 2,97,821 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఆంధ్రజ్యోతి విజిట్‌లో వెలుగు చూసిన అంశాలు..
చార్మినార్ మండలంలోని సుల్తాన్‌షాహీ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఇక్కడ హెచ్‌ఎం, టీచర్-3, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పేట్ బషీరాబాద్ ప్రైమరీ స్కూల్‌లో కరెంట్ బిల్లు రూ.1.20 లక్షలు బకాయి ఉండడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
మన్సూరాబాద్ స్కూల్‌లో గతంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన షెడ్డు తొలగించలేదు. పాఠశాల ప్రాంగణంలో గడ్డి పెరిగింది.
ఇటీవల కురిసిన వర్షానికి ముషీరాబాద్ హైస్కూల్ తరగతి గదుల పై కప్పు పెచ్చులూడి పడ్డాయి.
బండ్లగూడ మండలంలోని భట్టినగర్ బాలుర ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడంతో శివాజీనగర్ ప్రైమరీ స్కూల్‌లో విలీనం చేశారు. సొంత భవనం లేకపోవడంతో కృష్ణారెడ్డినగర్‌లోని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. నెలకు రూ. 13వేల అద్దె చెల్లిస్తున్నారు.
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని 41 పీఎస్, హైస్కూళ్లలో సగం వరకు టాయిలెట్ల డోర్లు విరిగిపోయాయి.
బ్రాహ్మణబస్తీ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతోపాటు కరెంట్ ఇబ్బందులున్నాయి. ఎల్.నారాయణనగర్, న్యూ అశోక్‌నగర్, మేడిబావి ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో తాగునీరు, ఫర్నిచర్, కరెంట్ సమస్యలున్నాయి.
రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ ఆవరణను మద్యం ప్రియులు అపరిశుభ్రంగా మారుస్తున్నారు. రాత్రివేళలో పాఠశాల ప్రాంగణం ఓపెన్‌బార్‌లా తయారవుతోంది.
బేగంబజార్ డివిజన్‌లోని గోషామహల్ ప్రభుత్వ పాఠశాల మైదానం చెట్లు, మట్టి దిబ్బలతో అధ్వానంగా మారింది.