ఉప్పల్- మేడిపల్లి రోడ్డు అధ్వానం.. నల్ల చెరువు కట్ట వద్ద మరీ దారుణం
ABN , First Publish Date - 2021-06-04T14:21:16+05:30 IST
హైదరాబాద్ నుంచి వరంగల్‌కు 150 కి.మీల ప్రయాణానికి రెండు గంటలు పడుతుంది.
- జాతీయ రహదారిపై జామ్‌జాటం..!
- లోతైన గుంతలు.. భారీగా నీరు
- పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ నుంచి వరంగల్‌కు 150 కి.మీల ప్రయాణానికి రెండు గంటలు పడుతుంది. కానీ నగరం నుంచి నారపల్లి దాటే సరికి 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోంది. ఒక్కోసారి గంట అయినా నగర శివార్లు దాటుతామన్న గ్యారంటీ లేదు. కారణం.. అక్కడి రహదారి దుస్థితి. ఓ వైపు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే పనులు.. మరోవైపు గుంతలమయంగా మారిన రోడ్లతో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ప్రయాణం నరక ప్రాయంగా మారింది. మరీ ముఖ్యంగా ఉప్పల్ నల్లచెరువు వద్ద పరిస్థితి దుర్భరంగా మారింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నల్ల చెరువు కట్ట వద్ద రహదారిపై నీరు నిలవడం.. రోడ్డు గుంతలమయంగా మారడంతో పలువురు వాహనదారులు అదుపు తప్పి కింద పడ్డారు. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
భారీగా నీరు.. వాహనదారుల బేజారు..
వరంగల్ జాతీయ రహదారిపై నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. నగరం నుంచి లక్షలాది మంది జనగాం, వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ వైపు వెళ్తుంటారు. ఈ మార్గంలో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో రహదారి క్యారేజ్ వే తగ్గింది. వంతెనల నిర్మాణం కోసం పెద్ద ట్రక్కుల్లో సామగ్రి తీసుకువస్తుండడంతో రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వాస్తవంగా ఎప్పటి కప్పుడు రోడ్డు మరమ్మతు చేస్తూ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలి. అధికారులు పట్టించుకోకపోవడంతో నెలల తరబడి గుంతలు అలానే ఉంటున్నాయి. ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఓ వైపు గుంతలు, వరద, డ్రైనేజీ నీరు రోడ్డుపై భారీగా నిలుస్తోంది.
గుంతల్లో నీరు నిలుస్తుండడంతో వాహనాల వేగం నెమ్మదిస్తోంది. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉండి వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించినా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పనులు చేసేది తాము కాదని జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక్కడి మరమ్మతు పనులను పట్టించుకోవడం లేదు.. ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తోన్న ఎన్‌హెచ్‌ఏఐలోని ఆర్ అండ్ బీ కూడా ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రయాణానికి పట్టే సమయంలో సగం నగరం నుంచి వెలుపలికి రావడానికి పడుతుందని వరంగల్‌కు చెందిన వాహనదారుడొకరు తెలిపారు.