రాష్ట్ర ప్రభుత్వానికి పేదల ప్రాణాలంటే లెక్కలేదు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-26T16:35:38+05:30 IST

పేదల ప్రాణాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు ఏమాత్రం లెక్కలేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ

రాష్ట్ర ప్రభుత్వానికి పేదల ప్రాణాలంటే లెక్కలేదు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్/కేపీహెచ్‌బీకాలనీ: పేదల ప్రాణాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు ఏమాత్రం లెక్కలేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌లో హౌసింగ్‌బోర్డు స్థలంలో సెల్లార్‌ నీటి గుంతలో పడి చనిపోయిన ముగ్గురు చిన్నారుల్లో ఒకరైన సఫియా కుటుంబ సభ్యులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, మాదాపూర్‌ జోన్‌ డీసీపీతో ఫోన్‌లో మాట్లాడారు. జరిగిన ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కనీసం తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం ఇవ్వకుండా బాలికల మృతదేహాలను దహనం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఐ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అన్ని విభాగాల అధికారులపై ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఒక్క మంత్రి కూడా రాకపోవడం, నష్ట పరిహారంపై ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఇదే నీటి గుంతలో గతంలో ఇద్దరు పిల్లలు చనిపోయినా నీటి  కుంటను పూడ్చకుండా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హౌసింగ్‌బోర్డు అధికారులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు ఎంత ఎక్స్‌గ్రేసియా ఇస్తున్నారని హౌసింగ్‌బోర్డు అధికారులను ఎంపీ ఫోన్‌లో ప్రశ్నించారు. తక్షణమే వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు రూ.20వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నా రు. ఈ కార్యక్రమంలో మోయిజ్‌, దెంది అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T16:35:38+05:30 IST