రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ డైరెక్టర్ మృతి

ABN , First Publish Date - 2021-06-22T12:42:02+05:30 IST

నిత్యావసర సరుకుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా...

రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ డైరెక్టర్ మృతి

హైదరాబాద్‌ సిటీ/చాంద్రాయణగుట్ట : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు టి.కరణ్‌ రాజ్‌ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ప్రమాద వివరాలిలా ఉన్నాయి. గౌలిపురా గాంధీబొమ్మ వద్ద నివసించే టి.కరణ్‌రాజ్‌(55) సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించాడు. ఈనెల 16న ఉదయం ఇంటినుంచి నిత్యావసర సరుకుల కోసం వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా హనుమాన్‌ నగర్‌ వద్ద స్కార్పియో కారు (ఏపీ03ఎల్‌ఎల్‌3366) ఢీకొట్టింది. కారును నడిపిస్తున్నది ఓ ఫిజియో థెరపీ డాక్టర్‌ కావడంతో గాయాలపాలైన కరణ్‌రాజ్‌ను ఆస్రా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. తదుపరి చికిత్స తనతో కాదని డాక్టర్‌ తప్పించుకున్నాడు. ఆదివారం రాత్రి కరణ్‌రాజ్‌ పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం అతను మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.మహేష్‌ తెలిపారు.


దర్శకుడిగా ఒక సినిమా..

కరణ్‌రాజ్‌ ‘చిలకపచ్చ కాపురం’, ‘బొమ్మన బ్రదర్స్‌.. చందన సిస్టర్స్‌’ వంటి పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఇదో ప్రేమలోకం సినిమాకు దర్శకత్వం వహించాడు. కరణ్‌రాజ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2021-06-22T12:42:02+05:30 IST