ఎర్లీ బర్డ్‌ గడువు పొడిగింపు..!

ABN , First Publish Date - 2021-05-02T07:30:08+05:30 IST

ఎర్లీ బర్డ్‌ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు ఎర్లీ బర్డ్‌లో భాగంగా ఆస్తి పన్ను చెల్లించవచ్చని పేర్కొంటూ శనివారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎర్లీ బర్డ్‌ గడువు పొడిగింపు..!

  మే 31వ తేదీ వరకు అవకాశం

హైదరాబాద్‌ సిటీ, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎర్లీ బర్డ్‌ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు ఎర్లీ బర్డ్‌లో భాగంగా ఆస్తి పన్ను చెల్లించవచ్చని పేర్కొంటూ శనివారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును పథకంలో భాగంగా పెంచిన గడువులోపు ఐదు శాతం రాయితీతో చెల్లించవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తెలిపారు. ప్రతి యేటా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో భాగంగా ఐదు శాతం రాయితీతో పన్ను చెల్లించవచ్చు. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నారు.  

రూ.364.23 కోట్లు వసూలు.. 

 ఎర్లీ బర్డ్‌లో భాగంగా ఈ నెలలో రూ.364.23 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. జీహెచ్‌ఎంసీ రూ.600కోట్ల పన్ను వసూలును లక్ష్యంగా పెట్టుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆఫర్‌లో భాగంగా రూ.573 కోట్ల పన్ను వసూలు కాగా.. ఏప్రిల్‌లో వసూలైన మొత్తం రూ.108 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.364.23 కోట్లు ఖజానాలో చేరింది. మరో నెల రోజులు గడువు పొడిగించిన నేపథ్యంలో మరో రూ.250 కోట్ల వరకు వసూలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎర్లీ బర్డ్‌ విషయంలో జీహెచ్‌ఎంసీ ఈ సారి భిన్నంగా వ్యవహరించింది. ప్రతి యేడాది ఆఫర్‌కు సంబంధించి విస్తృత ప్రచారం చేస్తారు. కానీ ఈ సారి మాత్రం ష్‌.. గప్‌చుప్‌ అన్నట్టుగా వ్యవహరించారు. ఎర్లీ బర్డ్‌ ఏప్రిల్‌ 6వ తేదీన ప్రారంభం కాగా.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చిందనే విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించ లేదు. ప్రతి వారం వసూళ్లు, గడువు ఎప్పటి వరకు అనే సమాచారంతో అంతకుముందు క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేసే సంస్థ ఇప్పుడు వ్యవహరించిన తీరు సంస్థలోని అధికారులకే ఆశ్చర్యం కలిగించింది. ఎర్లీ బర్డ్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని రెవెన్యూ విభాగం వర్గాలు తెలిపాయి. రాయితీకి సంబంధించి చెల్లింపుదారుల మొబైల్‌ నెంబర్లకు సందేశం కూడా రాకపోవడం గమనార్హం. ఎప్పుడూ లేనిది అధికారులు ఎందుకిలా..? వ్యవహరించారన్నది ఆసక్తికరంగా మారింది.   


Updated Date - 2021-05-02T07:30:08+05:30 IST