ఆదివారం హాలిడేస్పాట్‌గా ట్యాంక్‌బండ్‌

ABN , First Publish Date - 2021-08-25T07:00:54+05:30 IST

ట్యాంక్‌బండ్‌ ఇకనుంచి ఆదివారాల్లో కేవలం సందర్శకులనే ఆహ్లాద పరచనుంది.

ఆదివారం హాలిడేస్పాట్‌గా ట్యాంక్‌బండ్‌

రోడ్డుపై వాహనాలు నిషేధం..

సందర్శకులకు చాన్స్‌

ఈ ఆదివారం నుంచే అమలు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ట్యాంక్‌బండ్‌  ఇకనుంచి ఆదివారాల్లో కేవలం సందర్శకులనే ఆహ్లాద పరచనుంది. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈనెల 29 (ఆదివారం) నుంచే  దీనిని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో కొన్ని గంటలపాటు వాహనాలకు అనుమతివ్వకుండా కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం కొన్ని ఆదివారాలు ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఆ తర్వాత ఎన్నిగంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేయాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సీపీ వివరించారు. 


ఓ పౌరుడి సూచనతో

ట్విటర్‌ వేదికగా ఓ పౌరుడు ఇచ్చిన సూచనను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్వాగతిస్తూ ఈ దిశగా అమలు చేయాలని హైదరాబాద్‌ సీపీకి ట్యాగ్‌ చేశారు. ట్విటర్‌లో అశోక్‌ చంద్రశేఖర్‌ అనే పౌరుడు పేర్కొన్న అంశాల్లో ‘ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌ మీద వాహనాలను అనుమతించకుంటే సందర్శకులకు ఆహ్లాదంగా ఉంటుంది. మీ ప్రభుత్వం అందిస్తున్న అందమైన సౌకర్యాలను ఆస్వాదించడానికి అవకాశముంటుంది. రోడ్డు దాటాలన్నా, నడవాలన్నా కుటుంబాలతో కలిసి వచ్చే సందర్శకులకు ఇబ్బందికరంగా మారింది’ అని ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2021-08-25T07:00:54+05:30 IST