అంతా నేను చూసుకుంటా... అక్రమార్కులకు కొందరు కార్పొరేటర్ల అండ!
ABN , First Publish Date - 2021-07-08T20:12:00+05:30 IST
నగరంలో ఎక్కువగా నోటరీ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి అనుమతి లేని...
- క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్ల తీరు
- తాజాగా ఎల్‌బీనగర్‌లో వివాదం
- పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన పరిస్థితి
- అంతా చూసుకుంటామంటూ మరి కొందరి మాయాజాలం
- అంతస్తుకో రేటంటు వసూళ్లు
- సర్కారు సీరియస్‌గా ఉంది.. ఉపేక్షించిది లేదు- పట్టణ ప్రణాళికా విభాగం
హైదరాబాద్ సిటీ : అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోన్న జీహెచ్‌ఎంసీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఇటీవల ఎల్‌బీనగర్‌లో స్థానిక కార్పొరేటర్లు అడ్డుకున్నారు. నాగోల్ సాయినగర్‌లో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, లింగోజిగూడ గ్రీన్ పార్క్ కాలనీలో స్థానిక కార్పొరేటర్‌తో పాటు బీజేపీ నాయకులు కూల్చివేతలను నిలిపివేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తుదకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు కూల్చివేస్తుంటే ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. చట్టాల అమలుకు కృషి చేయాల్సిన పాలక మండలి సభ్యులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో అభ్యంతరం చెబుతున్నారా, ఇతరత్రా ప్రయోజనాలున్నాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా అక్రమంగా భవన నిర్మాణాలు చేపట్టడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ఈ తరహా నిర్మాణాలను కూల్చివేస్తారు. గ్రేటర్‌లో లక్షల సంఖ్యలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాలున్నాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ తతంగానికి ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకసారి అడ్డుకట్ట వేయాల్సిందే అంటూ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశలోనే గుర్తించి నేలమట్టం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వారి అండతోనే...
క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతోనే అనుమతి లేని నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది సర్కారు. జోన్ల వారీగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి.. ఒక్కో బృందాన్ని ఒక్కోసారి ఒక్కో సర్కిల్‌లో కూల్చివేతలకు పంపాలని నిర్ణయించింది. పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, డీసీ/ఏఎంసీలతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఒక్కో బృందంలో ఉంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) ద్వారా అవుట్ సోర్సింగ్‌లో నియమితులైన ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇస్తున్నాయి. వాటి ఆధారంగా బృందాలు కూల్చివేతలు చేపడుతున్నాయి. స్థానిక సర్కిల్‌తో సంబంధం లేని అధికారులు, బృందాలు వచ్చి కూల్చివేస్తుండడంతో ప్రస్తుతానికి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పని చేయడం లేదు.
అక్కడి సర్కిల్‌లోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు దాదాపుగా ఏం చేయలేని పరిస్థితి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కూల్చివేయవద్దంటూ కార్పొరేటర్లు, రాజకీయ నేతలు అడ్డుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. మున్ముందు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులూ.. తమ సర్కిల్‌కు ఏ బృందం వెళ్లిందో తెల్సుకొని అంతకుముందే కుదిరిన ఒప్పందంలో భాగంగా కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చకుండా అడ్డుకునే అవకాశముంది. ఇదే జరిగితే ఎప్పటిలానే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా పుట్టుకొస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతస్తుకో రేటు...
నగరంలో ఎక్కువగా నోటరీ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా స్థలాల్లో భవన నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వదు. ఈ క్రమంలో మెజార్టీ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు లేదా సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను మేనేజ్ చేసి భవనాలు నిర్మిస్తున్నారు. గ్రేటర్‌లోని చాలా మంది కార్పొరేటర్లు అక్రమంగా నిర్మించే భవనానికి ఓ రేటు, అనుమతి తీసుకొని చేపట్టే నిర్మాణాలకు ఓ రేటు నిర్ణయించి కప్పం వసూలు చేస్తున్నారు. అంతస్తులను బట్టి ఎన్ని లక్షలనేది కొందరు కార్పొరేటర్లు నిర్ణయిస్తారు. అధికారులు వసూలు చేసే మొత్తం దీనికి అదనం. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ఓ కార్పొరేటర్ మూడంతస్తుల భవన నిర్మాణం కోసం రూ.2 లక్షలు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో ఓ కార్పొరేటర్ 60 గజాల్లో నాలుగంతస్తులు నిర్మించిన ఇంటికి రూ.1.5 లక్షలు తీసుకున్నారని తెలిసింది. సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని ఒకరిద్దరు కార్పొరేటర్ల వసూళ్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
కొందరిది మరో తీరు
ఉప్పల్ సర్కిల్ పరిధిలోనూ ఇటీవల అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగాయి. అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించుకుంటోన్న ఓ డివిజన్‌లోని కొందరు స్థానిక కార్పొరేటర్‌ను కలిశారు. ‘అంతా నేను చూసుకుంటా’ అని భరోసా ఇచ్చిన ఆయన కూల్చివేతలు జరిగేటప్పుడు ఫోన్ చేస్తే స్పందించలేదు. నేరుగా వెళ్తే ఇంట్లో ఉండీ లేడని చెప్పించారని సమాచారం. గూడు కోసం కట్టుకున్న ఇళ్లు కళ్లముందే కూల్చివే స్తుండడంతో నిర్మాణదారులు లబోదిబోమన్నారు.
మేనేజ్ చేసుకున్నా లాభముండదు
స్థానికంగా మేనేజ్ చేసుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే ఇక లాభముండదు. అనుమతి లేని భవనాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఏ బృందం ఏ సర్కిల్‌కు వస్తుందో తెలియదు. అలాంటప్పుడు కూల్చివేతలు ఆపడం అంత సులువు కాదు. అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం సీరియ్‌సగా ఉంది. కూల్చివేతలకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అవాంతరాలను పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలన్నది నిర్ణయిస్తాం.
- పట్టణ ప్రణాళికా విభాగం అధికారి.
ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణల కూల్చివేత..
రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ నుంచి ఉప్పర్‌పల్లి వరకు మూసీ పరీవాహక ప్రాంతం బఫర్‌జోన్‌లోని సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. బ్లూ షీట్స్‌తో ప్రహరీ నిర్మించారు. బుధవారం అధికారులు దాన్ని కూల్చివేయించారు. దాంతో పాటు బుద్వేల్ సర్వేనెంబర్ 89లోని 36 కుంటల ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఐదు గదులను, ప్రహరీని, ఆర్చ్‌లను నేలమట్టం చేయించారు. కబ్జాకు గురికాకుండా అధికారులు కాపాడిన స్థలాల విలువ సుమారు రూ. 30 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆర్డీవో కె.చంద్రకళ పర్యవేక్షణలో రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్‌గౌడ్ నేతృత్వంలో డిప్యూటీ తహసీల్దార్లు రాజు, రవికుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సారిక ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు.
కేసులు పెడతాం : తహసీల్దార్
బుద్వేల్ సర్వేనెంబర్ 89లోని 36 కుంటల స్థలాన్ని పక్క సర్వే నెంబర్‌ను చూపి ఆక్రమించారు. వీటన్నింటికీ కారకులైన వారిని గుర్తించి కేసులు నమో దు చేస్తాం. స్వాధీనం చేసుకున్న సర్వేనెంబర్ 89 స్థలం విషయం కలెక్టర్‌కు నివేదిస్తాం.
