సాఫ్ట్‌వేర్‌ తప్పంటూ సొంత లెక్కలు.. మారని తీరు!

ABN , First Publish Date - 2021-06-21T17:39:11+05:30 IST

పారదర్శక పౌర సేవల్లో భాగంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో...

సాఫ్ట్‌వేర్‌ తప్పంటూ సొంత లెక్కలు.. మారని తీరు!

  • జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు
  • నిర్మాణ అనుమతుల ఫీజు లెక్కింపులో గందరగోళం
  • ఆన్‌లైన్‌ను కాదని మాన్యువల్‌గా ఇంటిమేషన్‌ లెటర్లు
  • టీఎస్‌ బీపాస్‌ ఉన్నా మారని తీరు
  • ఓ అధికారికి మెమో

హైదరాబాద్‌ సిటీ : పారదర్శక పౌర సేవల్లో భాగంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం చట్టాలను సవరించి నూతన విధానాలను ప్రకటించింది. అయినా కొందరు అధికారులు పౌరులను ఇబ్బంది పెట్టడం, మోసం చేసే ప్రయత్నం చేయడం ఆగలేదు. తాజాగా జీహెచ్‌ఎంసీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ భవన నిర్మాణ అనుమతి దరఖాస్తుకు సంబంధించి ఆన్‌లైన్‌లో చేసిన ఫీజు లెక్కింపు తప్పని పేర్కొంటూ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సొంత లెక్కలు చేసి రుసుంను అమాంతం పెంచారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో సర్కిల్‌లోని పట్టణ ప్రణాళికా విభాగం అధికారొకరికి మెమో జారీ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని పేర్కొంది. సహేతుకంగా వివరణ లేని పక్షంలో చర్యలు తీసుకుంటామంది.


పాతదారిలో అధికారులు

నిర్మాణ అనుమతుల జారీని సులభతరం చేస్తు ప్రభుత్వం టీఎస్‌ బీపాస్‌‌ను కొన్నాళ్ల క్రితం పాక్షికంగా అమలులోకి తీసుకువచ్చింది. నూతన నిబంధనల్లో భాగంగా 75 చదరపు గజాల్లోపు విస్తీర్ణం వరకు భవనాలకు అనుమతి అవసరం లేదు. కార్పొరేషన్లు, మునిసిపాల్టీలకు రూపాయి చెల్లించి నిబంధనల ప్రకారం నిర్మించుకుంటున్నట్టు సమాచారమిస్తే చాలు. 75 చ.గల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ పొందే అవకాశముంది. దరఖాస్తు చేసిన వెంటనే అనుమతి లభిస్తుంది. కాకపోతే 14 రోజుల్లో అధికారులు పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అనంతరమే నిర్ణీత రుసుం చెల్లించి నిర్మాణ పనులు ప్రారంభించాలి.


నూతన సాఫ్ట్‌వేర్‌లో స్థల విస్తీర్ణం, ఎన్ని అంతస్తులు నిర్మించాలనుకుంటున్నారు అన్న వివరాలతోపాటు అవసరమైన డాక్యుమెంట్లు, ప్లాన్‌ అప్‌లోడ్‌ చేస్తే ఆన్‌లైన్‌లో ఫీజు లెక్కింపు జరుగుతుంది. ఆ సమాచారం దరఖాస్తుదారుల మొబైల్‌ నెంబర్‌కు వెళ్తుంది. ప్లాన్‌ అనుమతి ఉన్న లే అవుట్‌లో ఉందా, క్రమబద్ధీకరించుకున్నారా, రిజిస్ర్టేషన్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ కటాఫ్‌ తేదీలోపు జరిగిందా లేదా అన్న వివరాల ఆధారంగా నిర్ణీత రుసుమును కంప్యూటర్‌ లెక్కకడుతుంది. కొన్ని సర్కిళ్లలో అధికారులు తమకు ఇన్నా ళ్లూ అలవాటైన తీరునే మళ్లీ కనబరుస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫీ లెక్కింపు సరిగా లేదంటూ సొంత లెక్కలు కడుతున్నారు. మొబైల్‌ నెంబర్‌కు వచ్చి న ఫీజు సమాచారం కంటే ఎక్కువగా మాన్యువల్‌ ఫీ ఇంటిమేషన్‌ లెటర్‌ ఇస్తున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఒకలా, అనంతరం ఎక్కువగా పర్మిషన్‌ ఫీజు చెల్లించాలని అధికారులు చెబుతుండడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌ బీపాస్‌ అమలులోకి తెచ్చినా కొందరు అధికారుల తీరు మారడం లేదని ఆరోపిస్తున్నారు.


చందానగర్‌ సర్కిల్‌లో..

శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌ సర్కిల్‌లో ఇటీవల ఓ నిర్మాణ అనుమతి దరఖాస్తుకు సంబంధించి ఫీజు లెక్కింపు విషయంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆన్‌లైన్‌లో ఫీజు లెక్కింపు జరిగినా.. అది తప్పంటూ మాన్యువల్‌గా లెక్కింపు చేసిన అక్కడి పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు దరఖాస్తుదారుడికి ఫీజు ఇంటిమేషన్‌ లెటర్‌ ఇచ్చాయి. ఆన్‌లైన్‌ ఫీజుతో పోలిస్తే కొన్ని రెట్లు ఎక్కువగా ఈ ఫీజు ఉండడంతో దరఖాస్తుదారుడు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దరఖాస్తును పరిశీలించిన కేంద్ర కార్యాలయ అధికారులు ఆన్‌లైన్‌లో ఫీజు లెక్కింపు సరిగానే జరిగినా మాన్యువల్‌గా ఎందుకు ఫీ ఇంటిమేషన్‌ లెటర్‌ ఇచ్చారో వివరణ ఇవ్వాలని అక్కడి అధికారి ఒకరికి మెమో జారీ చేశారు. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారొకరు తెలిపారు. ఈ ఒక్క సర్కిల్‌లోనే కాదు, మాన్యువల్‌గా ఫీ ఇంటిమేషన్‌ లెటర్లు ఇవ్వడం పలు సర్కిళ్లలో పరిపాటిగా మారింది.

Updated Date - 2021-06-21T17:39:11+05:30 IST