ప్రముఖ జర్నలిస్ట్ వాసుదేవరావుకు శుభోదయం వెలుగు పురస్కారం

ABN , First Publish Date - 2021-03-01T21:46:29+05:30 IST

కళలు, సమాజసేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘‘శ్రీ కలపటపు జగన్మోహనరావు స్మారక - శుభోదయం వెలుగు’’...

ప్రముఖ జర్నలిస్ట్ వాసుదేవరావుకు శుభోదయం వెలుగు పురస్కారం

హైదరాబాద్: కళలు, సమాజసేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘‘శ్రీ కలపటపు జగన్మోహనరావు స్మారక - శుభోదయం వెలుగు’’ తొలి పురస్కారానికి గల్ఫ్ ప్రైమ్ జర్నలిస్ట్ వాసుదేవరావు ఎంపికయ్యారు. రెండు దశాబ్దాల క్రితం బహ్రెయిన్‌కు ఒక సామాన్య కూలీగా వెళ్లి, పాత్రికేయ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుని, కరోనా సమయంలో గల్ఫ్ భారతీయులకు గణనీయమైన సేవ చేసిన వాసుదేవరావును ఈ అవార్డు వరించింది. 


శుభోదయం గ్రూప్ 4వ వార్షికోత్సవం సందర్భంగా కళలు, సామాజిక సేవా రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులకు ప్రత్యేక పురస్కారాలతో గౌరవించేందుకు శుభోదయం గ్రూప్ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా తెలుగువారి అభిమాన గాయకుడు ఎస్పీబీకి 60 మంది గాయకులతో హృదయాంజలి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. ఈ అవార్డులకు సంబంధించిన సమాచారాన్ని పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హృదయాంజలి కార్యక్రమం సక్సెస్ మీట్‌లో శుభోదయం గ్రూప్ ఛైర్మన్ కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్  తెలియజేశారు. 2022 నుంచి ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సంగీత దర్శకులు, ఉత్తమ గేయ రచయితతో పాటు, ఉత్తమ వాద్యకళాకారునికి కూడా అవార్డు ప్రదానం చేస్తామన్నారు. 2021లో విడుదలైన తెలుగు చలన చిత్రాల నుంచి నామినేషన్స్ ఆహ్వానించి, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ గారి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన వారికి శుభోదయం సంస్ధ వార్షికోత్సవ ఉత్సవాల సందర్భంలో అవార్డ్స్ ఇస్తామని శ్రీలక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. వీటితో పాటు సంగీతం కోసం జీవితాన్ని అంకితం చేసిన కళాకారునికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామన్నారు. ముందుగా గాన గంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద సంగీత ప్రపంచానికి సేవ చేస్తున్న కళాకారులని సత్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. 


ఇక దేశ సేవలో కుటుంబాలకు దూరంగా... నిద్రాహారాలు మాని కంటికి రెప్పలా ప్రజలను కాపాడుతున్న జవాన్లలోని తెలుగు రాష్ట్రాల సైనికులు, పోలీసు సోదరుల కుటుంబాల కోసం శుభోదయం వెంచర్‌లలో 10 కేటాయిస్తామని, ఇందులోని స్థలాలను తాము కొన్న ధరలో 50 శాతం ధరకే వారికి విక్రయిస్తామని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తామే భరిస్తామని శ్రీలక్ష్మి ప్రసాద్ తెలిపారు. రాబోయే అన్ని శుభోదయం వెంచర్లలో భారతీయ జెండాతో కూడిన భారత మాత విగ్రహం ఉంటుందని వివరించారు. 


నగరంలోని శ్రీసత్యసాయి నిగమామంలో ఎస్పీబీకి నివాళిగా 60 మంది గాయనీగాయకులతో శుభోదయం గ్రూప్ ఏర్పాటు చేసిన హృదయాంజలి కార్యక్రమం అద్యంతం బాలు స్మృతిపథంలో సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆహూతులను విశేషరీతిలో ఆకట్టుకుంది. గాయనీగాయకులు తమ గానంతో పాటు ఎస్పీబీతో తమ అనుభవాలు, అనుభూతులను పంచుకుని సభలో ఆర్ద్రత నింపారు.


Updated Date - 2021-03-01T21:46:29+05:30 IST