కరోనా సెకండ్ వేవ్.. : మందుబాబులకు షాకింగ్ న్యూస్..

ABN , First Publish Date - 2021-05-09T13:22:54+05:30 IST

తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)...

కరోనా సెకండ్ వేవ్.. : మందుబాబులకు షాకింగ్ న్యూస్..

హైదరాబాద్‌ : రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రెండోదశ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు అధికంగా ఉంటోందని తెలిపారు. మద్యపానం సేవించేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషించారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వెబినార్‌ జరిగింది. 


రెండోదశ కొవిడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ చేతన్‌ ముందాడ, శాస్వకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ విశ్వేశ్వరన్‌ పాల్గొని సలహాలు అందించారు. మొదటిదశ కరోనా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపించగా.. రెండోదశలో యువత, చిన్నారులు, గర్భిణులు సైతం దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. గర్భిణులు పాజిటివ్‌గా ఉంటే ప్రసవం తర్వాత, అప్పుడే పుట్టిన పిల్లలకు వైరస్‌ ఉన్నట్టు ఇంతవరకు తేలలేదన్నారు. కానీ ప్రసవం తర్వాత శిశువులకూ పాజిటివ్‌ వస్తోందన్నారు. శిశువులు, చిన్నారుల్లో తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండటం లేదని, అయిపనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చిన్నారుల్లో గొంతులో ఇబ్బంది, అన్నం తినడానికి ఇబ్బంది పడటం, జ్వరం, విరేచనాలు చిన్నారుల్లో కరోనా లక్షణాలు అని పేర్కొన్నారు.


ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ అందుబాటులో ఉండటంతో 18 సంవత్సరాలు పైబడిని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. ఒక డోస్‌ వ్యాక్సిన్‌ కరోనాను అడ్డుకోదని, మొదటి డోస్‌ తీసుకున్నాక రెండో డోస్‌ 4-8 వారాల్లో తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెండు డోసులు పూర్తయ్యాక 15 రోజుల తర్వాతనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక కూడా 10-30 శాతం కొవిడ్‌కు అవకాశం ఉంటుందన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక 4 వారాల తర్వాత కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చన్నారు. 


ఆక్సిజన్‌ లెవల్‌ 94 కంటే తక్కువగా ఉంటేనే ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని, అప్పటివరకు ఎలాంటి ఆందోళనా అవసరం లేదన్నారు. ప్రతి రోజూ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌తో ఆక్సిజన్‌ స్థాయిని పెంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచించారు. 18 సంవత్సరాల్లోపున్న చిన్నారులకు వ్యాక్సిన్‌ వద్దని, వీరికి వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐఐ తెలంగాణ మహిళా విభాగం వైస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఉమ ఐసోలా, వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T13:22:54+05:30 IST