నగ్నమునికి ‘శిఖామణి జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం

ABN , First Publish Date - 2021-10-31T17:40:15+05:30 IST

‘‘ఒక అస్వస్థ సమాజాన్ని స్వస్థతలోకి తేవాలనే లక్ష్యంతో కవిత్వాన్ని...

నగ్నమునికి ‘శిఖామణి జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం

హైదరాబాద్‌ సిటీ : ‘‘ఒక అస్వస్థ సమాజాన్ని స్వస్థతలోకి తేవాలనే లక్ష్యంతో కవిత్వాన్ని ఆశ్రయించిన అభ్యుదయ భావకుడు నగ్నముని అని పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‌ కొనియాడారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో కవి సంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ, యానాం నిర్వహణలో శనివారం రవీంద్రభారతి వేదికగా సాహితీవేత్తలు కె. శివారెడ్డి, కొలకలూరి ఇనాక్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ చేతులమీదుగా ప్రముఖ రచయిత, దిగంబరకవిగా ఖ్యాతి పొందిన నగ్నమునికి ‘శిఖామణి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. యువ పురస్కారాన్ని (సురేంద్రదేవ్‌ విదేశాల్లో ఉండడంతో) సురేంద్రదేవ్‌ తండ్రి రవి అందుకున్నారు. 

.

అనంతరం శిఖామణి కవితా సర్వస్వం, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రచన ‘కవిత్వ దీపశిఖ’ పుస్తకాలను ఆవిష్కరించారు. సభాధ్యక్షత వహించిన కె.శివారెడ్డి మాట్లాడుతూ ‘‘అచ్చమైన దేశీయ కవి శిఖామణి. ఆయన కవిత్వం అత్యంత సరళంగా, హాయిగా అద్భుతంగా ఉంటుంద’’ని శ్లాఘించారు. ‘‘సాత్విక ఉద్వేగాలు, సానుకూల భావాలు, ప్రేమపూర్వక ఆలోచనలు కలిగించే కవిత్వం సమాజానికి అవసరం. అలాంటి ఆర్ధ్రతతో కూడిన కవిత్వం శిఖామణి రచనల్లో కనిపిస్తుంద’’ని కె.శ్రీనివాస్‌ ప్రశంసించారు. నగ్నముని మాట్లాడుతూ శిఖామణి పురస్కారం అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలోనూ తెలుగు సమాజంలో ఆంధ్రజ్యోతి ఒక్కటే ధైర్యంగా వార్తలు రాస్తోందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న పలువురికి కవిసంధ్య ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. 

Updated Date - 2021-10-31T17:40:15+05:30 IST