డేంజర్‌ ‘బెల్స్‌’..! పాఠశాలల్లో అగ్ని ప్రమాద రక్షణ చర్యలు శూన్యం

ABN , First Publish Date - 2021-02-05T06:27:26+05:30 IST

గ్రేటర్‌లోని హైదరాబాద్‌,

డేంజర్‌ ‘బెల్స్‌’..! పాఠశాలల్లో అగ్ని ప్రమాద రక్షణ చర్యలు శూన్యం
గౌలిపురాలోని పాఠశాలలో ఎగిసిపడుతున్న మంటలు


82 శాతం బడుల్లో నిబంధనలకు నీళ్లు 

ఫైర్‌సేఫ్టీ లేకుండానే విద్యాసంస్థల నిర్వహణ

భయందోళనకు గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు


ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పలు విద్యాసంస్థల్లో ఫైర్‌సేఫ్టీ జాగ్రత్తలను పాటించకపోవడంతో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు పాతబస్తీ గౌలిపురాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో గురువారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదమే ఉదాహరణ.


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 5,524 కార్పొరేట్‌, బడ్జెట్‌ పాఠశాలలు కొనసాగుతుండగా.. దాదాపు 18 లక్షల మంది చదువుతున్నారు. 82 శాతం విద్యాసంస్థల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలు, ఎన్‌ఓసీలు లేవని తెలుస్తోంది. వాస్తవంగా నగరంలో 15 కిలోమీటర్ల పరిధిలో నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసుకుంటే ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీకి, 15 కిలో మీటర్ల తర్వాత పెట్టుకుంటే అగ్నిమాపకశాఖకు ఫైర్‌సేఫ్టీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తగిన పత్రాలను సమర్పించాలి. కొత్తగా పాఠశాలలు ఏర్పాటు చేసుకుంటున్న వారెవరూ అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో జీ+3కి పైగా భవనాల్లో పాఠశాలలు కొనసాగుతుండగా, కాగితాల్లో జీ+1 చూపిస్తూ ఫైర్‌సేఫ్టీ నియ మాలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో వచ్చిన జీఓ 56 ప్రకారం జీ+3,4,5లో కొత్త స్కూళ్ల ఏర్పాటు, పాతవాటిని రెన్యూవల్‌ చేసుకునే వారు తప్పనిసరిగా ఫైర్‌ నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. మెజార్టీ సంస్థలు ఈ నిబంధనను పాటించడం లేదు. మామూళ్లకు అలవాటుపడిన కొందరు విద్యాశాఖాధికారులు అగ్ని మాపక జాగ్రత్త చర్యలను పరిశీలించకుండానే యాజమాన్యాలకు అనుమతులు జారీ చేస్తున్నారు. ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టెంపరరీ రికగ్నైజేషన్‌ (ఈటీఆర్‌) సమయంలో కూడా అదే విధంగా వ్యవహరిస్తుండడంతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.


రెండేళ్లలో నాలుగు ప్రమాదాలు..

2018లో ఆబిడ్స్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో, 2019లో ధరమ్‌కరణ్‌ రోడ్డులో, అదే ఏడాది అమీర్‌పేటలో, 2020లో పాతబస్తీలోని ప్రైవేట్‌ కాలేజీలో, తాజాగా గౌలిపురాలోని బడిలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అగ్నిప్రమాద నివారణ చర్యలు మొక్కుబడిగా పాటించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొంటున్నారు. ఫైర్‌సేఫ్టీ ఎన్‌ఓసీ, రెన్యూవల్‌ కోసం 5 ఏళ్ల కాలంలో కేవలం 20 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, దీనిని బట్టి చూస్తే ఎన్ని పాఠశాలల్లో అగ్నిప్రమాదాలను నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


అనుమతులను రద్దు చేయాలి: శ్యాం, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి

గ్రేటర్‌లో చాలా ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ప్రధానంగా ఫైర్‌సేఫ్టీ చర్యలు చేపట్టకుండా విద్యాసంస్థలను నిర్వహిస్తూ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎన్‌ఓసీలు లేని వాటిని తక్షణమే మూసివేయాలి. 


గౌలిపురాలోని స్కూల్‌లో అగ్నిప్రమాదం

చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : పాతబస్తీ గౌలిపురాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాస స్కూల్‌ కార్యాలయం గదిలో ఒక్కసారిగా మంటలు లేచాయి. స్థానిక యువకులు స్పందించి పాఠశాలలో ఉన్న సుమారు 25 మంది విద్యార్థులను భవనం పైనుంచి పక్క భవనాలపైకి చేర్చారు. కార్యాలయం గదిలో ఉన్న ఉపాధ్యాయలు బయటికి పరుగులు తీశారు. ఛత్రినాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్‌కు సమాచారమందించారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యార్థులను పక్క భవనాలపైకి చేర్చడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 


‘మదారత్‌’ స్కూల్‌కు షోకాజ్‌ నోటీస్‌

1 నుంచి 8 తరగతులకు క్లాసుల నేపథ్యంలో... 


హైదరాబాద్‌  సిటీ/కార్వాన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష తరగతులతో పిల్లలకు కొవిడ్‌ అంటుకునే ప్రమాదం ఉంటుందని ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. ప్రైవేట్‌ యాజమాన్యాలు తమకేం పట్టలే అన్నట్లుగా వ్యవహరిస్తూ పాఠాలు బోధిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రాథమిక విద్యార్థులకు క్లాస్‌రూమ్‌ బోధనలు నిర్వహిస్తున్న నగరంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలను విద్యాశాఖాధికారులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.


విజయ్‌నగర్‌ కాలనీలో దర్జాగా బోధనలు..

కొవిడ్‌ నేపథ్యంలో 9, 10, ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు మాత్రమే తరగతి గది బోధనలు చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. అయితే నగరంలోని విజయ్‌నగర్‌ కాలనీలోని మదారత్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ గురువారం 9, 10 విద్యార్థులతో పాటు 1 నుంచి 8 పిల్లలను కూడా బడికి రప్పించింది. 40 మంది విద్యార్థులకు ఉదయం 9 నుంచి పాఠాలు బోధించడం ప్రారంభించారు. దీనిపై డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లుకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆసిఫ్‌నగర్‌ డీఐఓ రాంప్రసాద్‌.. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా 1 నుంచి 7 తరగతుల్లో 40 మంది విద్యార్థులు కనిపించారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా.. తాము ట్యూషన్‌ మాత్రమే చెబుతున్నామని, తల్లిదండ్రుల అంగీకారం తీసుకున్న తర్వాతనే విద్యార్థులు వచ్చినట్లు సమాధానం చెప్పినట్లు తెలిసింది.


షోకాజ్‌ నోటీసు జారీ..

నిబంధనలు అతిక్రమించి క్లాస్‌రూమ్‌ బోధనలు నిర్వహిస్తున్న మదారత్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు డీఐఓ రాంప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 1-7 పిల్లలకు ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారనే దానిపై 24 గంటల్లో జిల్లా విద్యాశాఖాధికారికి సమాధానం తెలియజేయాలని నోటీసులో సూచించారు. లేని పక్షంలో పాఠశాలను సీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో నోటీసును పాఠశాల గోడకు అంటించారు. 

Updated Date - 2021-02-05T06:27:26+05:30 IST