ఆర్టీసీ పరిరక్షణకు పోరాటం
ABN , First Publish Date - 2021-07-24T06:40:07+05:30 IST
టీఎస్ ఆర్టీసీ పరిరక్షణకు పోరాడతామని, ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి ప్రయత్నిస్తే తిరుగుబాటు చేస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె. రాజిరెడ్డి, వైస్ చైర్మన్‌లు కె. హన్మంత్ ముదిరాజ్ హెచ్చరించారు.

ఆస్తులు అమ్మితే తిరుగుబాటు
వచ్చేనెల 7న బస్ భవన్ ఎదుట నిరసన
10న సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేత
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
హైదరాబాద్ సిటీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): టీఎస్ ఆర్టీసీ పరిరక్షణకు పోరాడతామని, ఆర్టీసీ ఆస్తులు అమ్మడానికి ప్రయత్నిస్తే తిరుగుబాటు చేస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కె. రాజిరెడ్డి, వైస్ చైర్మన్‌లు కె. హన్మంత్ ముదిరాజ్ హెచ్చరించారు. వీఎస్టీలోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం టీఎస్ ఆర్టీసీ జేఏసీ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో నియామకాలు, నిధులు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మంత్రి, ఆర్టీసీ ఎండీకి జేఏసీ ఆధ్వర్యంలో సమస్యలపై వినతిపత్రం సమర్పిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జేఏసీ లేదు, యూనియన్లు లేవని ప్రకటించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు జేఏసీ అధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు విస్తృత ప్రచారం చేస్తామన్నారు. ఈనెల 26న ఆర్టీసీ యాజమాన్యం వైఖరిపై లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదుచేస్తామని, ఆగస్టు 3న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు.7న బస్ భవన్ ఎదుట నిరసన, 10న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల పరిధిలోని ఎమ్మెల్యేలకు సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రాలు అందచేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలో సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి గడ్కరీకి వినతిపత్రం ఇవ్వాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. 2019 సమ్మెకు ముందున్న పరిస్థితులను కల్పిస్తూ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ల హక్కులు పునరుద్ధరించాలని, ప్రతినెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణతోపాటు టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికుడిదే అని అమలుచేస్తూ, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. యాజమాన్యం సీసీఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని, తార్నాక ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీగా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు పి.కమాల్‌రెడ్డి, అబ్రహాం, బి. సురేష్ పాల్గొన్నారు.