రెండు దోపిడీలూ.. ఒకే ముఠా
ABN , First Publish Date - 2021-05-05T06:14:34+05:30 IST
ఏప్రిల్-29న పట్టపగలే కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన కాల్పులు, దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.

జీడిమెట్ల, కూకట్‌పల్లి కేసులను ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్-29న పట్టపగలే కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన కాల్పులు, దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. కాల్పుల ఘటనకు 13 రోజుల ముందు జీడిమెట్లలో ఓ ఆన్‌లైన్ మనీ ట్రాన్సఫర్ దుకాణంలో రాబరీకి పాల్పడింది కూడా ఇదే ముఠాగా నిర్ధారించారు. నిందితుల క్రిమినల్ హిస్టరీని పరిశీలిస్తే ముఠా ప్రధాన నిందితుడు గతంలో పలు చోరీలు, రాబరీలు చేసినట్లు నిర్ధారణ అయింది. కూకట్‌పల్లిలో కాల్పులు జరిపి రూ.5లక్షలో ఉడాయించిన దుండగులు రైల్లో బిహార్ బయట్దేరారు. సైబరాబాద్ పోలీసులు వాయు వేగంతో గాలింపు ముమ్మరం చేశారు. అదే రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే ముఠాలో ఒకడ్ని పట్టుకున్నారు. ప్రధాన నింధితుడు తృటిలో తప్పించుకోగా, అతడి ఆచూకీ తెలుసుకొని నిందితుడి కంటే ముదే బిహార్ వెళ్లి కాపుకాశారు. ఎట్టకేలకు ప్రధాన నిందితుడిని పట్టుకుని పోలీసులు నగరానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. నిందితులను విచారించిన క్రమంలో ఏప్రిల్-16న తెల్లస్కూటీపై హెల్మెట్స్ ధరించి వెళ్లి జీడిమెట్లలో ఆన్‌లైన్ మనీ ట్రాన్సఫర్ దుకాణంలో ఉన్న వ్యక్తిని తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడింది కూడా వీరే అని పోలీసులు ధ్రువీకరించారు. 13 రోజుల అనంతరం దుండగులు అదే హెల్మెట్‌ను ఉపయోగించి కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.5లక్షలు దోపిడీ చేశారు. దుండగులు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ ఆలీబేగ్ మృతి చెందగా.. శ్రీనివాస్ అనే వ్యక్తి గాయపడిన విషయం తెలిసిందే.
వాహనం ఎవరిది?
జీడిమెట్లలో దోపిడీలో ఉపయోగించిన తెల్ల రంగు స్కూటీ(టీవీఎస్ జూపిటర్) ఎవరిదనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చిన ప్రధాన నిందితుడు నగరంలో కూలి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో నగరంలో పరిచయం ఉన్న వ్యక్తి నుంచి స్కూటీ తీసుకొని జీడిమెట్లలో దోపిడీ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆ స్కూటీ ఎవరిదనేది తేల్చాల్సి ఉంది. రెండు రాబరీల్లో నిందితులు బైక్‌లను నంబర్ ప్లేట్ లేకుండా వినియోగించారు.