అసలే అనారోగ్యం.. ఆ పై కారు బోల్తా...
ABN , First Publish Date - 2021-05-08T17:27:30+05:30 IST
అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా

- ఆస్పత్రికి వెళ్తున్న వ్యక్తి మృతి
హైదరాబాద్/రాజేంద్రనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 291 వద్ద కారు బోల్తాపడి ఆ వ్యక్తి మృతిచెందాడు. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి జాతీయ పోలీస్ అకాడమీ ఎదుట గల కింగ్స్ కాలనీలో నివాసం ఉండే కలీమ్(70) ఆయాసంతో బాధపడుతున్నాడు. దీంతో శుక్రవారం మధ్నాహ్నం కుటుంబ సభ్యులు తస్లీమ్ ఫాతిమా, అనీద్లు లంగర్‌హౌజ్ నానల్‌నగర్ వద్ద గల ఆస్పత్రికి కారు(ఏపీ28డీఎక్స్-2786)లో తీసుకెళ్తున్నారు. పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్ వే పై పిల్లర్ నెం.291 వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనారోగ్యంతో ఉన్న కలీమ్ మరింత అనారోగ్యానికి గురి కాగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించాడని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.