‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి గెలుచుకున్న తెలంగాణ ఎస్ఐతో ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్..
ABN , First Publish Date - 2021-11-28T15:52:52+05:30 IST
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో తొలిసారిగా రూ. కోటి గెలుచుకున్న అనుభూతి...

- ఖాకీ.. కోటీశ్వరుడు
- రూ. కోటి విజేత సైబర్ క్రైం ఎస్సై
- నగర సీఐడీ విభాగంలో విధులు
- ‘ఆంధ్రజ్యోతి’తో రాజారవీంద్ర
హైదరాబాద్ సిటీ : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో తొలిసారిగా రూ. కోటి గెలుచుకున్న అనుభూతి మరువలేనిదని విజేత రాజారవీంద్ర అన్నారు. నగర సీఐడీ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న రాజా రవీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమంలో ఈ ఘనత సాధించారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో హాట్ సీట్లో కూర్చోవడం మరపురాని అనుభూతి. 15వ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత విజేతగా ప్రకటించే సమయంలో ఆయన తీసుకున్న గ్యాప్ కాస్త టెన్షన్‌కు గురి చేసినా, చివరకు ఆయనే ఉత్సాహంగా లేచి అభినందించడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది అన్నారు.
సరదాగా ప్రోగ్రాం చూస్తూ..
పోటీలో పాల్గొనాలనే ఆలోచన ముందునుంచి లేదు. సరదాగా ప్రోగ్రాం చూస్తుండగా, ప్రయత్నించమని మా ఆవిడ ఒకటిరెండు సార్లు ప్రోత్సహించింది. ప్రోగ్రాం సమయంలో వారు అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం పంపించాను. వరుసగా మూడు రోజులు ఆన్సర్ పంపించాను. మూడు రోజుల తర్వాత ఓ కాల్ వచ్చింది. అందులోనూ కొన్ని ప్రశ్నలడిగారు. వాటికీ వెంటనే సమాధానాలు చెప్పాను (చెప్పాల్సి ఉంటుంది కూడా). లక్షల మందిలో ర్యాండమ్‌గా ఎంపిక చేయడంతో నా నెంబర్‌కు కాల్ వచ్చింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఇక హాట్ సీట్ వరకు వెళ్లొచ్చని. ఆ తర్వాత ఫైనల్‌గా హాట్‌సీట్ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయ్యాననే సమాచారం వచ్చింది. మొదటి రోజు హాట్ సీట్‌కు వెళ్లే అవకాశం వస్తుందో లేదోననేది టెన్షన్. ఆ రోజు ఫాస్టెస్ట్ ఫింగర్లో టాప్ అయ్యాను.
చెమటలు పట్టించిన ప్రశ్న
పోటీలో 14వ ప్రశ్న మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. రెండు ప్రశ్నలు రెండు లైఫ్లైన్లు మిగిలి ఉన్నాయి. ప్రశ్న కాస్త కన్ఫ్యూజన్గా ఉండటంతో లైఫ్‌లైన్ తీసుకుని సమాధానం చెప్పాను. తర్వాత చివరి ప్రశ్న స్ర్కీన్ మీద ప్రత్యక్షమైంది. ప్రశ్నలో ‘1956 రాష్ర్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వేసిన కమిషన్‌కు అధ్యక్షత వహించిందెవరు?’ జవాబు తెలిసినప్పటికీ అనుమానం వెంటాడింది. ఫజల్ అలీ కమిషన్ అని తెలుసు. కానీ అధ్యక్షత వహించిందెవరు అని అడిగారు. సాధారణంగా కమిషన్లు వ్యక్తుల పేరిట వారి అధ్యక్షతలోనే ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా అడగడంతో అనుమానం ప్రారంభమైంది. ఏమాత్రం తప్పు చెప్పినా రూ. 3.2 లక్షలకు వెళ్లి పోతారని ఎన్టీఆర్ హెచ్చరికలు.. క్విట్ అయితే రూ. 50 లక్షలు తీసుకెళ్ల వచ్చనే ఆలోచన.. అయినా ముందుకెళ్దామనే సిద్ధమయ్యారు. సమాధానంలో అనుమానం ఉన్నందున సేఫ్‌సైడ్‌గా ఉన్న ఒక్క లైఫ్‌లైన్ తీసుకున్నాను. మిత్రుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో మాట్లాడి ప్రశ్న చదివాను. అతను ఫజల్ అని అదే ఆన్సర్ చెప్పాడు. అనుమానం తొలగింది. ధైర్యంతోనే ఆన్సర్ చేశాను. కాస్త ఆగిన ఎన్టీఆర్ ఒక్కసారిగా లేచి మీరు రూ. కోటి గెలుచుకున్నారని ప్రకటించారు.

పేద చిన్నారుల చికిత్సకూ..
గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని పెద్ద రోగాల బారిన పడి చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్న చిన్నారుల కోసం వెచ్చిస్తాను. అనారోగ్యం, ఆపరేషన్ అవసరమున్నప్పటికీ ఆర్థిక సాయం అందని చిన్నారుల సంక్షేమార్థం కొంత డబ్బు వెచ్చించాలని నిర్ణయించుకున్నాను.
పోలీస్ కావాలనే..
మాది కొత్తగూడెం (గతంలో ఖమ్మం జిల్లా) జిల్లా, సుజాతనగర్. చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే ఆకాంక్షతో పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ఎల్ఎల్బీ చదివాను. ఎస్ఐగా (2012 బ్యాచ్‌లో) ఎంపికైన తర్వాత ట్రైనింగ్ సమయంలోనూ పీజీ డిప్లొమా ఇన్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ చదివాను. భార్య సింధూజ (గృహిణి), ఇద్దరు పిల్లలు.. బాబు(5) ఒకటో తరగతి, పాప (3) ఉన్నారు. తండ్రి బీవీఎ్‌సఎస్ రాజు, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి శేషుకుమారి ఉన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సర్కిల్ ప్రొబేషనరీ ఎస్ఐగా, మంథని సర్కిల్లో ఎస్హెచ్ఓగా పని చేశాను. ప్రస్తుతం సీఐడీ సైబర్ క్రైమ్‌లో పని చేస్తున్నాను.

అంతర్జాతీయ పతకం తీసుకొస్తా..
స్వతహాగా రైఫిల్, పిస్టల్‌లో షూటింగ్ క్రీడాకారుణ్ని. ఇప్పటికే ఎన్నో స్థానిక, అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొన్నాను. ఓపెన్ స్టేట్ తెలంగాణ స్టేట్‌లెవెల్ గోల్డ్‌మెడల్, మరో పోటీలో కాంస్యం, ప్రీ నేషనల్లో గోల్డ్, నేషనల్ కాంపిటీషన్స్‌లోనూ మూడుసార్లు క్వాలిఫై అయ్యాను. షూటింగ్‌పై ఉన్న ఆసక్తితో దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని మెడల్ తీసుకురావాలనేది లక్ష్యం. దానికోసం శిక్షణ, విదేశాలకు వెళ్లి రావడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తన ఆలోచనకు సాకారం చేసేలా పోటీలో గెలుచుకున్న డబ్బును లక్ష్యం కోసం వినియోగిస్తాను. శాయశక్తులా ప్రయత్నించి ఒలింపిక్స్, అంతర్జాతీయస్థాయి వరకు వెళ్లాలనే లక్ష్యాన్ని సాధిస్తాను.
