‘ఐడెంటిటీ’ దొరకట్లే.. GHMC కసరత్తు !

ABN , First Publish Date - 2021-12-08T17:12:39+05:30 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో 17 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్లు (పీటీఐఎన్‌) ఉన్నాయి...

‘ఐడెంటిటీ’ దొరకట్లే.. GHMC కసరత్తు !

  • భాగ్యనగరంలో డబుల్‌ పీటీఐఎన్‌లు
  • 80 వేల నుంచి లక్ష ఉంటాయని అంచనా
  • కూలిన భవనాలకూ నంబర్ల గుర్తింపునకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ పరిధిలో 17 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్లు (పీటీఐఎన్‌) ఉన్నాయి. రెగ్యులర్‌గా పన్ను చెల్లిస్తున్న వారు 14 లక్షలు మాత్రమే. మొండి బకాయిదారులు, కోర్టు కేసులు, ఇతర కారణాలతో చెల్లించని వారు రెండు లక్షల వరకు ఉంటారని అధికారులు చెబుతున్నారు. మరో 80 వేల నుంచి లక్ష వరకు డబుల్‌ పీటీఐఎన్‌లు ఉంటాయని అంచనా. ఈ క్రమంలో వాటి గుర్తింపునకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయి ఉన్న వారి వివరాలను డాకెట్ల వారీగా గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. అక్కడ పాత భవనం ఉందా, కూల్చివేసి కొత్తది నిర్మించారా అన్న వివరాలు సేకరించనున్నారు. వాటి ఆధారంగా డబుల్‌ పీటీఐఎన్‌లను గుర్తించి ఉన్నతాధికారుల ఆమోదంతో బ్లాక్‌ చేయాలని భావిస్తున్నారు. నేడు జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఇప్పటికే పలు సర్కిళ్లలో గుర్తించిన 16 పీటీఐఎన్‌లను బ్లాక్‌ చేయాలని ప్రతిపాదించారు. 


డబుల్‌ పీటీఐఎన్‌లు ఇలా..

నగరంలో దశాబ్దాల క్రితం నాటి నివాసాలు ఇప్పటికీ ఉన్నాయి. శిథిలావస్థకు చేరినవి కూల్చివేసి కొందరు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇంకొందరు డెవల్‌పమెంట్‌కు ఇస్తున్నారు. కోర్‌ ఏరియాతోపాటు శివారు సర్కిళ్లలోనూ ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. పాత ఇంటిని కూల్చి కొత్తది నిర్మించిన పక్షంలో నిబంధనల ప్రకారం మునుపటి పీటీఐఎన్‌ ఆ నిర్మాణానికి కేటాయించాలి. లేనిపక్షంలో ఆ పిటీఐఎన్‌ను బ్లాక్‌ చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలి. జీహెచ్‌ఎంసీలో ఇవేమీ జరగడం లేదు. పాత నిర్మాణం కూల్చి చేపట్టిన నిర్మాణాలకు కొత్త పీటీఐఎన్‌ కేటాయిస్తున్నారు. దీంతో పాత నిర్మాణానికి,  కొత్త నిర్మాణానికి వేర్వేరు పీటీఐఎన్‌లు ఉంటున్నాయి. నిర్మాణం లేకపోయినప్పటికీ పీటీఐఎన్‌ నెంబర్‌ ఉండడంతో ఆస్తిపన్ను దీర్ఘకాలిక బకాయి లిస్టు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డబుల్‌ పీటీఐఎన్‌లను గుర్తించి బ్లాక్‌ చేసే కసరత్తు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీలోని రెవెన్యూ విభాగం వర్గాలు చెబుతున్నాయి.


డిమాండ్‌ అధికంగా..

జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను డిమాండ్‌ రూ.2300- 2500 కోట్లు. అధికారులు వసూలు చేయాలనుకుంటోన్న లక్ష్యం రూ.1800 కోట్లు. వసూలవుతోన్న పన్ను రూ.1400 కోట్లు మాత్రమే. కోర్టు కేసులు, మొండి బకాయిదారులను మినహాయిస్తే వాస్తవ డిమాండ్‌ పెరగడానికి డబుల్‌ పీటీఐఎన్‌లు కూడా కారణమని అధికారులు చెబుతున్నారు. రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల మేర ఈ తరహా డిమాండ్‌ ఉండవచ్చంటున్నారు. డబుల్‌ పీటీఐఎన్‌లను గుర్తించి బ్లాక్‌ చేసిన పక్షంలో ఆస్తిపన్ను వాస్తవ డిమాండ్‌ తగ్గుతుందని, వసూలవుతోన్న పన్ను శాతం పెరిగే అవకాశముందన్నారు.

Updated Date - 2021-12-08T17:12:39+05:30 IST