పవర్‌బ్యాంక్‌ యాప్‌లో పెట్టుబడి పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-05-18T12:14:14+05:30 IST

పవర్‌ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు ఓ యువకుడు.

పవర్‌బ్యాంక్‌ యాప్‌లో పెట్టుబడి పేరుతో మోసం

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : పవర్‌ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయాడు ఓ యువకుడు. ఎక్కువ లాభాలు వస్తాయన్న స్నేహితుల మాటలను విశ్వసించి లక్షా 8 వేలను పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. ఇందిరాపార్కు సమీపంలో సాయిరామ్‌ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతని స్నేహితులు ఇటీవల పవర్‌బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌లో రెండు, మూడు వేలు చొప్పున పెట్టుబడి పెట్టారు. రెట్టింపు లాభాలు రావడంతో వారు సాయిరామ్‌ను కూడా ఇందులో చేర్చారు. యాప్‌ను నిర్వహించిన సైబర్‌ కేటుగాళ్లు గొలుసుకట్టు తరహాలో మరికొంత మందిని చేర్పిస్తే కమీషన్‌ కూడా ఇస్తామని, అంతేకాకుండా వారి పెట్టుబడుల్లో కూడా కొంత కమీషన్‌ రూపంలో మీ బ్యాంకు ఖాతాకు జమచేస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మి అత్యాశకు పోయిన సాయిరామ్‌ తాను రూ.లక్ష డిపాజిట్‌ చేయడమే కాకుండా తెలిసిన స్నేహితుడి పేరుపై మరో ఎనిమిది వేలు కట్టాడు. ఆ తర్వాత నుంచి యాప్‌ కనిపించకుండా పోయింది. యాప్‌ నిర్వాహకుల ఫోన్లు కూడా స్విచ్చాఫ్‌ రావడంతో సాయిరామ్‌ సోమవారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.  

Updated Date - 2021-05-18T12:14:14+05:30 IST