ఉచితంగా కొన్ని.. ఫీజులతో మరికొన్ని.. శునకాలకూ బోర్డింగ్
ABN , First Publish Date - 2021-05-21T14:42:44+05:30 IST
కరోనా ప్రభావం తీవ్రంగా ఉందిప్పుడు. ఇంటిలో ఒకరికి కరోనా వస్తే, ఇంటిల్లిపాదీకి...

- వసతి సౌకర్యాలను కల్పిస్తున్న పెట్ బోర్డింగ్ నిర్వాహకులు
- ఉచితంగా కొన్ని.. ఫీజులతో మరికొన్ని సంస్థలు
- పెట్ పేరెంట్స్ నుంచి గణనీయంగా పెరిగిన ఎంక్వైరీలు
హైదరాబాద్ సిటీ : కరోనా ప్రభావం తీవ్రంగా ఉందిప్పుడు. ఇంటిలో ఒకరికి కరోనా వస్తే, ఇంటిల్లిపాదీకి సోకేందుకు ఎక్కువ అవకాశాలుంటున్నాయి. ఆ తరహా సంఘటనలతో పెంపుడు జంతువులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇంట్లో అందరూ కరోనా బారినపడినప్పుడు వారి నుంచి పెట్స్‌కు సోకకుండా ఉండేందుకు వాటిని ఎక్కడ ఉంచాలని తీవ్రంగా మదనపడిపోతున్నారు. అలాంటి వారికి తోడ్పాటునందిస్తామంటున్నారు పెట్ బోర్డింగ్ సంస్థల నిర్వాహకులు. కరోనా నుంచి కోలుకోవడమెలాగో మీరు చూసుకోండి. మీ పెట్ సన్/డాటర్ యోగక్షేమాలు తాము చూసుకుంటామంటూ నగరమంతా తిరుగుతున్నారు. కేవలం ఓ ఫోన్ కాల్ చేస్తే మీ పెట్ ఫ్రెండ్స్ యోగక్షేమాలను చూసుకోవడానికి తాము వస్తామంటున్నారు. క్రైసిస్ బోర్డింగ్ సేవలుగా వీటిని అభివర్ణించుకుంటున్న నిర్వాహకులలో కొంతమంది ఉచితంగా ఈ సేవలను అందిస్తుంటే, మరికొంత మంది మాత్రం ఫీజులను వసూలు చేస్తున్నారు.
పెరిగిన పెట్ బోర్డింగ్ సంస్థలు...
నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే కొద్దీ పెట్ క్రైసిస్ బోర్డింగ్ సేవల కోసం ఎంక్వైరీలు కూడా గణనీయంగా పెరిగాయి. కరోనా వచ్చిన తొలి నాళ్లలో ఈ బోర్డింగ్ సేవలకు లాక్డౌన్ కాలంలో మహా అయితే 10ఎంక్వైరీలు వస్తే ఇప్పుడు రోజుకు 3,4 ఫోన్‌కాల్స్ వస్తున్నాయంటున్నారు స్కూబీస్ పెట్ సర్వీసెస్ నిర్వాహకుడు తేజ. ఇప్పటి వరకూ తాము 100కు పైగా పెట్స్‌కు బోర్డింగ్ సేవలనందించామని తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 5 పెట్స్ బోర్డింగ్ వసతులను వినియోగించుకుంటున్నాయన్నారు. వీరే కాదు.. నగరంలో ఇప్పుడు దాదాపు 20కు పైగా సంస్థలు ఈ పెట్ బోర్డింగ్ సేవలనందిస్తున్నాయి. కమాండో కెన్నల్స్ లాంటి కొన్ని సంస్థలు పూర్తి ఉచితంగానే ఈ సేవలను అందిస్తుంటే మరికొంతమంది కొద్ది మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం తమ పెట్స్‌ను బోర్డింగ్ సెంటర్లకు పంపుతున్నవారు గణనీయంగా పెరిగారంటున్నారు ఈ సంస్థల నిర్వాహకులు. గతంలో తమ పెట్స్‌ను వదిలి ఉండటానికి ఇష్టపడని వారు కూడా ఇప్పుడు తప్పనిసరై వాటిని తమ దగ్గర వదులుతున్నారని, అలాంటి డాగ్స్ తమ దగ్గర మూడు ఉన్నాయన్నారు. నగరంలో ఇప్పుడు కరోనా బాధిత పెట్ పేరెంట్స్ కారణంగా దాదాపుగా ప్రతి పెట్ బోర్డింగ్ కేంద్రంలోనూ మూడు నుంచి 10 డాగ్స్ వసతి పొందుతున్నాయన్నారాయన.
సురక్షితంగా ఉన్నామన్న భావన కల్పించాలి..
కరోనా ఎన్నో కుటుంబాలలో అంతులేని విషాదం తీసుకువచ్చింది. అలాంటి కుటుంబాలలో పెంపుడు జంతువులు ఉంటే వాటి వేదన వర్ణనాతీతమే! తాము చేయని తప్పునకు కూడా అవి బలైపోతున్నాయంటున్నారు పెట్ ప్రేమికులు. సాధారణంగా దేశీ బ్రీడ్స్‌ను పెంచుకునేటటువంటి వారు వాటిని వదిలేయడం ఎక్కువగా ఉంటే, బ్రీడెడ్ డాగ్స్‌ను ఆసక్తి కలిగిన వారికి అందించడం, లేదంటే సోషల్ మీడియా ద్వారా దత్తతకు ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నారని పెట్ ప్రేమికుడు శ్రీధర్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈ సెకండ్‌వేవ్ సమయంలో కాస్త ఎక్కువగా ఈ ఆఫర్లు కనబడుతున్నాయన్నారు. ఈ కరోనా సమయంలో పెంపుడు జంతువులను అనాథలుగా వదిలేస్తోన్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోన్న వేళ అవి సురక్షితంగా ఉన్నామనే భావన కలిగించాల్సిన అవశ్యకత ఉందంటున్నారు డాగ్ బోర్డింగ్ సదుపాయాలను అందిస్తున్న కల్పన. ఇప్పుడు పెట్ పేరెంట్స్ మానసిక స్థితి కూడా అర్థం చేసుకోతగ్గదే కానీ, పెట్స్‌నూ అదేరీతిలో అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇదే విషయాన్ని తేజ కూడా చెబుతూ కొవిడ్-19 బారిన పెట్ పేరెంట్స్ తమ డాగ్స్‌ను బయట వదిలేయాల్సిన అవసరం లేదన్నారు. వారు ఒకవేళ ఆస్పత్రిలో చేరాల్సి వస్తే పెట్స్ గురించి తమను సంప్రదిస్తే చాలు వాటి బాగోగులు చూసుకుంటామన్నారు.
గతంతో పోలిస్తే ఎంక్వైరీలు పెరిగాయి..
గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంక్వైరీలు గణనీయంగా పెరిగాయి. రోజుకు3-4 కాల్స్ మాకు వస్తున్నాయి. సాధారణంగా పెట్ పేరెంట్స్ కొవిడ్ బారిన పడినా వాటి యోగక్షేమాలను ఇంటిలోని వారు చూసుకోవచ్చు. అయితే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే ఆ పెట్స్‌ను మేము జాగ్రత్తగా కాపాడుతున్నాం. పెట్‌ను మేమే పికప్ చేసుకోవడంతోపాటుగా డ్రాప్ చేస్తాం. పెట్‌ను మాకు అందించే వీలుకూడా లేకపోతే డోర్ బయట కట్టమని చెబుతున్నాం. పెట్ మా దగ్గరకురాగానే పూర్తిగా వాటికి మెడికల్ బాత్ చేయించి కెన్నల్‌కు తీసుకువెళ్తున్నాం. చిన్న బ్రీడ్స్ అయితే రోజుకు రూ.500, పెద్ద బ్రీడ్స్ అయితే రూ.700 వరకూ వసూలు చేస్తున్నాం. హోమ్ ఎవే ఫ్రమ్ హోమ్ అన్న అనుభూతులను వాటికి అందించడంతో పాటుగా ఫుడ్‌తో సహా అన్నీ తామే చూసుకుంటున్నాం. - తేజ, స్కూబీస్ పెట్ ట్యాక్సీ.
