కొత్త సోఫాతోపాటు రూ. 10 వేలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-02-01T06:39:43+05:30 IST
తనకు నచ్చిన విధంగా సోఫాను డిజైన్ చేసి ఇమ్మని అడిగిన వినియోగదారుడికి డ్యామేజ్ అయిన సోఫాను పంపిన సంస్థ తీరును

తీర్పును వెలువరించిన వినియోగదారుల ఫోరం
హైదరాబాద్ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తనకు నచ్చిన విధంగా సోఫాను డిజైన్ చేసి ఇమ్మని అడిగిన వినియోగదారుడికి డ్యామేజ్ అయిన సోఫాను పంపిన సంస్థ తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన వ్యక్తి బంజారాహిల్స్‌లోని ది ఇంటీరియర్ పార్క్ ఫర్నీచర్ సంస్థలో తనకు నచ్చిన విధంగా సోఫాను రూపొందించాలని ఆర్డర్ ఇచ్చి దానికయ్యే ఖర్చు రూ.90 వేలను ఆన్‌లైన్‌లో చెల్లించాడు. సంస్థ ప్రతినిధులు 18 రోజుల తర్వాత డ్యామేజ్ అయిన సోఫాను పంపారు. ఇది గమనించిన వినియోగదారుడు తనకు ఈ సోఫా అవసరంలేదు... డబ్బు వాపస్ చేయమని కోరాడు. సంస్థ ప్రతినిధులు తాము కొత్త సోఫాను ఇస్తాం కానీ డబ్బు వాపస్ చేయలేమని చెప్పాడు. దాంతో వినియోగదారుడు సోఫా ఖరీదు మొత్తం రూ.1.10 లక్షలతోపాటు మానసిక వేదనకు గురిచేసినందుకుగాను రూ.30 వేలు చెల్లించాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు కస్టమర్ డిజైన్ చేయించుకున్న సోఫాకు బదులుగా అలాంటిదే కొత్త సోఫా ఇస్తామని సమాధానమిచ్చారు. ఇరువురి వాదనలు విన్న జిల్లా వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ జస్టిస్ పి.విజేందర్, సభ్యులు జస్టిస్ కె.రామ్మోహన్‌లతో కూడిన బెంచ్ డ్యామేజ్ అయిన సోఫా స్థానంలో కొత్త సోఫాతోపాటు వినియోగదారుడికి మానసిక క్షోభ కలిగించినందుకు రూ.10వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు చెల్లించాలని తీర్పును వెలువరించింది.