HYD : నాడు హరితహారం.. నేడు కబ్జా.. పార్కులో ఇంటికి అనుమతి.. 2 కోట్ల స్థలానికి ఎసరు!

ABN , First Publish Date - 2021-11-19T14:12:25+05:30 IST

నాడు హరితహారం.. నేడు కబ్జా.. పార్కులో ఇంటికి అనుమతి.. 2 కోట్ల స్థలానికి ఎసరు..!

HYD : నాడు హరితహారం.. నేడు కబ్జా.. పార్కులో ఇంటికి అనుమతి.. 2 కోట్ల స్థలానికి ఎసరు!

  • తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ అధికారుల తీరు
  • బోరు వేస్తుండగా అడ్డుకున్న కాలనీ వాసులు..


హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్‌ : తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ అధికారుల తీరు ఇంతింతకాదయా అన్నట్టుగా మారింది. వీరి నిర్వాకంతో ఏకంగా రూ.2కోట్ల విలువైన సుమారు 671 గజాల పార్కు స్థలం అన్యాక్రాంతమవుతోంది. పరిశీలించకుండానే పార్కు స్థలంలో ఇంటి నిర్మాణానికి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అనుమతి ఇచ్చారు. అనుమతిదారుడు ఆ స్థలంలో బోరు పనులు కూడా ప్రారంభించాడు. స్థానికులు దానిని అడ్డుకోవడంతో వాగ్వాదం ఏర్పడి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పనులను నిలిపివేశారు. వివరాలిలా ఉన్నాయి.  తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధి మునగనూర్‌ గ్రామంలోని రామానుజన్‌ నగర్‌ కాలనీ సర్వేనంబర్‌ 47/2 లేవుట్‌లో సుమారు 671 గజాలు పార్కు కోసం కేటాయించారు. అందులో నుంచి ఇరిగేషన్‌ కాలువ కూడా ఉంది.


సదరు పార్కు మధ్య నుంచి ఉన్న కాలువను పక్కనే ఉన్న ప్లాట్లకు జరిపి కాలువపైనే బోరును వేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. దాదాపు 20 ఏళ్లుగా పార్కు స్థలాన్ని కాపాడుతూ వచ్చామని కాలనీ అధ్యక్షుడు కుమార స్వామి, గుత్త వెంకట్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ అంజయ్య, నక్క సువర్ణ రాజుగౌడ్‌తో పాటు గ్రామస్థులు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు  రూ.2కోట్ల విలువ చేసే పార్కు స్థలాన్ని అక్రమార్కులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థలాన్ని కాపాడాలని, ఆక్రమిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ జ్యోతికి గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.


నాడు అలా.. నేడు ఇలా..

గతేడాది పార్కు స్థలంలో స్థానిక కౌన్సిలర్‌ వేముల స్వాతి, గ్రామస్థులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అయితే, కబ్జాదారుడు యథేచ్ఛగా మొక్కలను తొలగించి ప్లాట్లుగా విభజించి ఇళ్లనిర్మాణానికి అనుమతులు పొందాడు. అధికారులు ముడుపులు పుచ్చుకునే ఈ తతంగం నడిపించారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పార్కు స్థలంలో, పైగా కాలువపైనే నిర్మాణాలు జరుగుతున్నా ఇరిగేషన్‌, మండల రెవెన్యూ అధికారులు కనీసం ఇటువైపు చూడకపోవడం గమనార్హం.

Updated Date - 2021-11-19T14:12:25+05:30 IST