మహానగరంలో మరో వంతెన.. నేడు ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-28T13:39:08+05:30 IST

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా...

మహానగరంలో మరో వంతెన.. నేడు ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఓవైసీ - మిధాని జంక్షన్‌లో రూ.80 కోట్లతో నిర్మించిన వంతెన నేడు అందుబాటులోకి రానుంది. దీనిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. చార్మినార్‌ జోన్‌లో ఇది మొదటి ఎస్‌ఆర్‌డీపీ వంతెన ఇప్పటి వరకు శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌ జోన్లలో మాత్రమే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఐటీ కారిడార్‌లో రద్దీ పెరుగుతోన్న నేపథ్యంలో అక్కడ వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.


బయో డైవర్సిటీ, మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌, అయ్యప్ప సొసైటీ వద్ద వంతెనలు, అండర్‌పా్‌సలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌బీనగర్‌ జోన్‌లో కామినేని, ఎల్‌బీనగర్‌, బైరామల్‌గూడ చౌరస్తాల్లోనూ కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. చార్మినార్‌ జోన్‌లో మిథాని నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు రూ.63 కోట్లతో 1.36 కి.మీల మేర మూడు లేన్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఈ వంతెనకు రూ.63 కోట్లు వ్యయం కాగా.. ఆస్తుల సేకరణ, తాగునీరు, సివరేజీ, విద్యుత్‌ కేబుళ్ల తొలగింపు వంటి పనుల కోసం రూ.17 కోట్లు ఖర్చు చేశారు. ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే.. మిధాని జంక్షన్‌ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు వెళ్లే వాహనాలు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఎల్‌బీనగర్‌ వైపు నుంచి పాతబస్తీకి రహదారుల వ్యవస్థ అనుసంధానం మెరుగవుతుంది.

Updated Date - 2021-12-28T13:39:08+05:30 IST