Liquor Shops : ‘కొత్త’ దారులు వెతుకుతున్న పాత వ్యాపారులు.. 10 కోట్లకు పైగా ఆదాయం..!
ABN , First Publish Date - 2021-11-26T18:00:19+05:30 IST
మద్యం షాపుల లైసెన్స్ దుకాణాలు ఈసారి కొత్తవారినే వరించడంతో వాటిని ఎలాగైనా...

- కొత్త వారికి లైసెన్స్.. షాపులు పాత వారివే
- షాపుల కోసం బేరసారాలు
- రూ. 10కోట్లకు పైగా ఆదాయం.. అందుకే డిమాండ్
- నిబంధనల్లో మార్పుతో కొత్తవారికీ లాభమే
హైదరాబాద్ సిటీ : మద్యం షాపుల లైసెన్స్ దుకాణాలు ఈసారి కొత్తవారినే వరించడంతో వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని పాత వ్యాపారులు కొత్తదారులను వెతుకుతున్నారు. ఇప్పటికే లాటరీలో పేరు వచ్చిన వారికి రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకైనా చెల్లించి ఆ లైసెన్స్‌ను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే డీల్ కూడా కుదిరినట్లు సమాచారం.
ఎలాగైనా లైసెన్స్ దక్కుతుందనే ప్లానింగ్‌తో కొన్ని ఏరియాల్లో మూడు నెలల క్రితమే కొత్త భవనాలు తీసుకున్నట్లు తెలిసింది. లాటరీలో పేరు రాకున్నా వచ్చిన వారినుంచి లైసెన్స్‌లను తీసుకొని వ్యాపారాలను ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, లైసెన్స్‌ను ఈజీగా రిజిస్టర్ చేయించుకునే వెసులుబాటును ఎక్సైజ్ శాఖాధికారులు కల్పించడంతో కొత్త వ్యాపారులు సైతం లైసెన్స్‌లకు రూ. 50లక్షల నుంచి రూ. కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. లైసెన్స్ ఉంటే రెండేళ్లలో రూ. 10కోట్లకు మించి సంపాదించుకునే అవకాశం ఉండడంతో పాత వ్యాపారులూ ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
రూ. 10కోట్లు పైనే లాభాలు
నగరంలోని షాపుల్లో ప్రస్తుతం సగటున ప్రతిరోజూ రూ. 5లక్షల వ్యాపారం సాగుతోందని అధికారిక అంచనా. అంటే నెలకు సగటున రూ.1.5కోట్ల వ్యాపారం. ఏడాదికి రూ. 18కోట్లు. రెండేళ్లకు రూ.36కోట్ల వ్యాపారం సాగుతోంది. అమ్మకాలపై వ్యాపారులకు 20 నుంచి 27 శాతం కమీషన్ ఉంటుంది. సగటున 25శాతం అనుకున్నా.. రూ. 9 కోట్ల నుంచి రూ. 10కోట్ల వరకు కమీషన్ వస్తుంది. అంతే కాకుండా రెండేళ్లలో వ్యాపారులు వెచ్చించే రూ. 2.2కోట్ల వార్షిక ఫీజుకు 10 రెట్ల వ్యాపారం వరకు పూర్తి కమీషన్ మిగిలిపోతుంది. ఇక మిగతా వ్యాపారంపై మాత్రం 6.4శాతం మాత్రమే ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడా మిగతా 20శాతం వ్యాపారులకే మిగులుతుంది. దీంతో ఈసారి లైసెన్స్ పొందే వ్యాపారులకు ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలిగిందని అధికారులు చెబుతున్నారు.
కొత్త వారికీ చాన్సు
ఒకేసారి రెండేళ్ల ఫీజు రూ.2.2కోట్లు చెల్లించలేమని భావించే వారు లైసెన్స్‌ను ఇతరులకు ఇచ్చే అవకాశముంది. కానీ, ఈసారి నిబంధనల్లో కాస్త మార్పు ఊరటనిచ్చే విషయమే. ఫీజును చెల్లించడానికి ఏడాదిలో ఆరు వాయిదాల వెసులుబాటు అంటే రెండేళ్లలో 12 వాయిదాలు ఉంటాయి. తొలి వాయిదా చెల్లిస్తే మిగతా వాయిదాలు లాభంలోనే కలిసి ఉంటాయని అధికారులే చెబుతున్నారు.
