GHMC : కౌన్సిల్‌ ఎప్పుడో.. పాలకమండలి కొలువుదీరి 8 నెలలైనా ఎందుకిలా.. అవినీతి బయటపడుతుందనే భయమా..!?

ABN , First Publish Date - 2021-10-31T16:35:23+05:30 IST

పాలకమండలి కొలువుదీరి దాదాపు ఎనిమిది నెలలు. జీహెచ్‌ఎంసీ చట్టంప్రకారం...

GHMC : కౌన్సిల్‌ ఎప్పుడో.. పాలకమండలి కొలువుదీరి 8 నెలలైనా ఎందుకిలా.. అవినీతి బయటపడుతుందనే భయమా..!?

  • ఇప్పటి వరకు ఒకే సమావేశం
  • గ్రేటర్‌ అభివృద్ధిపై ప్రభావం
  • మేయర్‌ను కలిసేందుకు బీజేపీ కార్పొరేటర్ల ప్రయత్నం

హైదరాబాద్‌ సిటీ : పాలకమండలి కొలువుదీరి దాదాపు ఎనిమిది నెలలు. జీహెచ్‌ఎంసీ చట్టంప్రకారం ప్రతి మూడు నెలలకో మారు సాధారణ సమావేశం నిర్వహించాలి. కానీ, ఇప్పటి వరకు ఒకే ఒక్క సమావేశం జరిగింది. అది కూడా వర్చువల్‌గా. మహానగర సమస్యల పరిష్కారంలో గ్రేటర్‌ కౌన్సిల్‌ కీలకం. కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువస్తారు. నగరంలో రూ.6కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి. ఆ తరువాతే ప్రభుత్వానికి పంపాలి. నిబంధనల ప్రకారం సమావేశాలు జరగకపోవడంతో కీలక అభివృద్ధి పనులతోపాటు.. ప్రజా సమస్యల పరిష్కారంపైనా ప్రభావం పడుతోంది.


నవంబర్‌లోనూ కష్టమే...?

ఈ ఏడాది ఫిబ్రవరి 11న పాలకమండలి కొలువుదీరింది. అదేరోజు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికతోపాటు బడ్జెట్‌పై చర్చించి ఆమోదించారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని జూన్‌ 29న వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. తూతూమంత్రంగా సాగిన ఈ మీటింగ్‌లో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు. వాస్తవంగా సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌ మొదటి వారంలో సమావేశం జరగాలి. అక్టోబర్‌ ముగుస్తోన్నా.. ఇప్పటికీ సాధారణ సమావేశం నిర్వహణకు సంబంధించిన కసరత్తు మొదలు కాలేదు. దీనిని పరిశీలిస్తే నవంబర్‌లో కూడా మీటింగ్‌ జరపడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించాలంటే కార్యదర్శి కార్యాలయం దారు ముందుగా సభ్యుల నుంచి ప్రశ్నలు తీసుకోవాలి. అనంతరం సంబంధిత విభాగాధిపతుల నుంచి సమాధానాలు సేకరించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఎజెండా ఖరారు చేసి, ఏడు పని దినాల ముందు సభ్యులకు పంపించాలి. ఇదంతా పూర్తయ్యేందుకు మూడు నుంచి నాలుగు వారాల ముందు కసరత్తు ప్రారంభించాలి. కానీ, తదుపరి సమావేశం కోసం ఇప్పటికీ కార్యదర్శి కార్యాలయం ప్రక్రియ మొదలుపెట్టలేదు. అంటే.. పండుగలు, ఇతరత్రా సెలవులు ఉన్న నవంబర్‌లో కూడా కౌన్సిల్‌ సమావేశం ఉండకపోవచ్చని ఓ అధికారి చెప్పారు. మేయర్‌ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నారు. 


అవినీతి, అక్రమాలు బయట పడతాయనే..!

అవినీతి, అక్రమాల బాగోతం బయటపడుతుందనే కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. సమావేశ నిర్వహణ కోసం మేయర్‌కు వినతిపత్రం అందజేసేందుకు శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వారు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 4.30 గంటల వరకు వేచి చూసి మేయర్‌ రాకపోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ‘నమ్మకంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. వారి సమస్యల పరిష్కారానికి ఏం చేయలేకపోతున్నాం. కార్పొరేటర్లకు బడ్జెట్‌ లేదు, మీటింగ్‌లు పెట్టరు. జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో అధికారులు నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు. ఇక మేమేం చేయాలి..?’ అని మండిపడ్డారు. అపాయింట్‌మెంట్‌ ఇచ్చి మేయర్‌ రాలేదని, సోమవారం మరోసారి ఆమెను కలిసే ప్రయత్నం చేస్తామని, మేయర్‌ కలవని పక్షంలో మంగళవారం నుంచి నిరసన చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు.Updated Date - 2021-10-31T16:35:23+05:30 IST