New Year Parties : వాహనదారులూ బీ అలర్ట్.. అమల్లోకి ఆంక్షలు
ABN , First Publish Date - 2021-12-31T14:06:23+05:30 IST
నగరం కొత్త సంవత్సర సంబురాలకు సిద్ధమవుతోంది. ప్రమాద రహితంగా

- నేటిరాత్రి 11నుంచి ఉదయం 5 వరకు ఓఆర్ఆర్ క్లోజ్
- ట్యాంక్‌బండ్‌పైనా నిషేధాజ్ఞలు
- బేగంపేట మినహా మిగిలిన ఫ్లైఓవర్లు మూత
- 500లకు పైగా తనిఖీ పాయింట్లు
- అడుగడుగునా డ్రంకెన్ తనిఖీలు
- 15వేల మందితో భద్రత
హైదరాబాద్ సిటీ : నగరం కొత్త సంవత్సర సంబురాలకు సిద్ధమవుతోంది. ప్రమాద రహితంగా వేడుకలు జరిగేందుకు పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హోంగార్డు నుంచి సీపీ వరకు అందరూ రోడ్డుమీదనే ఉంటూ బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ట్రై కమిషనరేట్ సీపీలు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ వేడుకల సందర్భంగా డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో యువత చిత్తుకావొద్దన్నారు. ఆంక్షల గురించి వివరించారు.
- వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం రాత్రి 11 నుంచి జనవరి-1 ఉదయం 5 వరకు ఓఆర్ఆర్ను క్లోజ్ చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. కేవలం మీడియం, హెవీగూడ్స్ లారీలను మాత్రమే అనుమతిస్తారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టిక్కెట్లు చూపిస్తే అనుమతిస్తారని సీపీ వెల్లడించారు.
- గ్రేటర్ పరిధిలో బేగంపేట ఫ్లైవోవర్ మినహాయించి మిగతా అన్ని ఫ్లైవోవర్లను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌పై రాత్రి 10నుంచి తెల్లవారుజామున 2గంటల వరకు ఎలాంటి వాహనాలనూ అనుమతించరు.
- అడుగడుగునా అన్ని ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
- వేడుకల్లో ఎవరూ కూడా మారణాయుధాలుగాని, లైసెన్స్ ఉన్న తుపాకులు గానీ ఉంచుకోవద్దు.
- సైబరాబాద్‌లో 200, హైదరాబాద్‌లో 200, రాచకొండలో 100కు పైగా చెకింగ్ పాయింట్ల ఏర్పాటు. ఈ పాయింట్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు.
- ప్రజల భద్రత, తనిఖీల నేపథ్యంలో ట్రై కమిషనరేట్‌లో కలిపి సుమారు 15వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు.
- డ్రైవర్స్ యూనిఫామ్‌లో ఉండాలి..
ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్ కచ్చితంగా యూనిఫామ్‌లో ఉండాలి. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలన్ని సిద్ధంగా ఉంచుకోవాలి.
- రాత్రి సమయంలో ఎక్కువ కిరాయిని డిమాండ్ చేసినా, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవు. అసౌకర్యం కలిగితే వాట్సాప్ 9490617111, డయల్-100కు ఫోన్ చేయాలి.